కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) నేడు అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఏపీ బడ్జెట్(AP Budget) ప్రవేశపెట్టారు. దీనికి ముందు రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యి బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది బడ్జెట్‌ను రూ.3,32,205 కోట్లుగా ప్రకటించారు. ఇందులో ఆర్థిక లోటు రూ.75,868.09 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ. 22,002.50 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా తెలిపారు. కేంద్ర పన్నుల వాటాగా రూ.64,362 కోట్లు, పన్నుయేతర ఆదాయం రూ.11,473 కోట్లు, పన్ను ఆదాయం రూ.1,25,845 కోట్లుగా వెల్లడించారు.
బడ్జెట్ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రూ.9 లక్షల 74 వేల కోట్లు అప్పు మిగిల్చిందని మంత్రి తెలిపారు. గత పాలనలో విధ్వంసం జరిగిందని విమర్శించారు. వైసీపీ పాలన రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టిందన్నారు. రాయలసీమ రైతుల కలలను నెరవేర్చేలా బడ్జెట్ రూపొందించామని, బడ్జెట్ శ్రీకాకుళం జిల్లా యువతకు గుండె నిబ్బరాన్ని కలిగిస్తుందని హామీ ఇచ్చారు. స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా బడ్జెట్‌ను రూపకల్పన జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రభుత్వ కొత్త విధానం విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తోందని వ్యాఖ్యానించారు.
శాఖల వారీగా కేటాయింపులు
బీసీ సంక్షేమం – రూ. 23,650కోట్లు
వెనకబడిన వర్గాలు – రూ. 10,699 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి – రూ. 22,941 కోట్లు
మున్సిపల్ శాఖ – రూ.14,538 కోట్లు
ఆరోగ్య రంగం – రూ. 19,306కోట్లు
జల వనరులు – రూ.18,223 కోట్లు
విద్యుత్ శాఖ – రూ. 13,934 కోట్లు
వ్యవసాయ రంగం – రూ.11,745 కోట్లు
సాంఘిక సంక్షేమ శాఖ – రూ.11,118 కోట్లు
పథకాలకు కేటాయింపులు ఇలా…
ఇక వీబిజ్ రామ్ జీ పథకానికి రూ.8,365 కోట్లు, ఎన్టీఆర్ వైద్యసేవకు రూ.4 వేల కోట్లు, ఇళ్ల నిర్మాణానికి రూ.5,451 కోట్లు, జల జీవన్ మిషన్‌కు రూ.4 వేల కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రూ.27,719 కోట్లు, దీపం పథకానికి రూ.2,60 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం పథకానికి రూ.9,668 కోట్లు కేటాయించారు. మహిళా, శిశు సంక్షేమానికి రూ.4,581 కోట్లు, స్కాలర్‌షిప్‌లకు రూ.3,836 కోట్లు, సమగ్ర శిక్షణకు రూ.2,946 కోట్లు, పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు, ఉన్నత విద్య కోసం రూ.2,566 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.2,161 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ.1,232 కోట్లు కేటాయింపులు చేశారు. మన బడి – మన భవిష్యత్ పథకానికి రూ.1,500 కోట్లు, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకు రూ.707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకానికి రూ.654 కోట్లు, యూత్ అండ్ స్పోర్ట్స్‌కు రూ.438 కోట్లు, సాగు నీటి ప్రాజెక్టులకు రూ. 9,906 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.1,927 కోట్లు, అన్నదాత సుఖీభవకు రూ.6,600 కోట్లు, మత్య్సకారుల సంక్షేమం కోసం రూ.260 కోట్లు కేటాయించారు.
మరిన్ని వివరాలు
బడ్జెట్లో రాజధాని అమరావతి కోసం రూ.6,000 కోట్లు కేటాయించారు. పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రానికి రూ.714 కోట్లు, పట్టాణాభివృద్ధి శాఖకు రూ.14,539 కోట్లు కేటాయించారు. 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. విశాఖ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి 10 జిల్లాలు రానున్నాయి. విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28 వేల కోట్లు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు రూ.30 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.6,105 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు కేటాయించారు.


