కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (Telangana Election Commission) ఎక్స్ అఫీషియో సభ్యుల అర్హతలపై కీలక సర్క్యూలర్ జారీ చేసింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్ ఎక్స్ అఫీషియో సభ్యులు (Ex Officio Members)గా ఎవరు ఉండవచ్చన్నదానిపై స్పష్టమైన ఆదేశాలతో సర్క్యులర్ జారీ చేశారు.
ఎక్స్ అఫీషియో సభ్యుల అర్హతలివే
తెలంగాణ రాష్ట్రానికి చెందిన లోక్‌సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు సంబంధిత మున్సిపల్ పరిధిలో ప్రాతినిథ్యం వహించాలి. స్థానిక మున్సిపల్ ప్రాంతంలోనే ఓటు హక్కు కూడా కలిగి ఉండాలి. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఆ మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఎస్ ప్రకారం ఏర్పడిన కమిటీల చైర్మన్‌లు ఉంటే వారు కూడా ఆ మున్సిపల్ ప్రాంతంలో ఓటరుగా నమోదై ఉండాలి. మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉన్నంత మాత్రాన ఓటరు కాలేరు. ఈ నిబంధనలకు అర్హత లేని వారు. మున్సిపాలిటీలో సభ్యులుగా ఉండలేరు. అలాంటి వారు ఓటు వేసినా, వారి సభ్యత్వం లేదా ఓటు చెల్లదు అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేర్చే ముందు వారి అర్హతలను ఖచ్చితంగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.


