కలం, వెబ్ డెస్క్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, పోలీసు వాహనం ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు (Kurnool) కు చెందిన విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) కుటుంబానికి న్యాయం చేకూరింది. ఈ విషాద ఘటనకు సంబంధించి సియాటెల్ (Seattle) నగర యంత్రాంగం భారీ పరిహారాన్ని ప్రకటించింది. భారత కరెన్సీలో సుమారు 262 కోట్ల రూపాయలు (29 మిలియన్ డాలర్లు) పరిహారంగా చెల్లించేందుకు సియాటెల్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు సియాటెల్ ప్రతినిధి అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఈ పరిహారం జాహ్నవి కుటుంబానికి కొంతైనా ఊరటనిస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రమాద ఘటన 2023 జనవరిలో చోటుచేసుకుంది. సియాటెల్‌లోని నార్త్ ఈస్ట్ సెక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న జాహ్నవిని, అతివేగంతో వస్తున్న ఒక పోలీసు పెట్రోలింగ్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనాన్ని నడుపుతున్న పోలీసు అధికారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి (Jaahnavi Kandula) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
అయితే ప్రమాదం జరిగిన తర్వాత సదరు పోలీసు అధికారి డేనియల్ అడరర్ మాట్లాడిన మాటలు అప్పట్లో వివాదాస్పదంగా మారాయి. జాహ్నవి మరణాన్ని తక్కువ చేస్తూ, ఆమె ప్రాణానికి పెద్దగా విలువ లేదన్నట్లుగా సదరు అధికారి మరొకరితో నవ్వుతూ మాట్లాడిన ఆడియో క్లిప్స్ బయటకు వచ్చి సంచలనం సృష్టించాయి. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అమెరికా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
Read Also: కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తన అవమానకరం: కిరణ్ రిజిజు
Follow Us On: Instagram


