కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రాకాసిపేట్, గోశాలలో వేరే వారికి సంబంధించిన పత్రాలతో దొంగ ఓట్లు (fake vote Bodhan) వేయడానికి ప్రయత్నించిన ఇద్దరిపై ఫోర్జరీ కేసు నమోదు అయ్యింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాకాసిపేట్ లోని బూత్ నం 24, గోశాల ఏరియాలో బూత్ నం 78 లోని పోలింగ్ కేంద్రాల్లో ఇతరుల పేర్లతో ఓటు వేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న సమయంలో నిందితులు తప్పుడు గుర్తింపు పత్రాలతో ఓటు వేయడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలింగ్ ఏజెంట్లు ఎన్నికల సిబ్బందికి అనుమానం వచ్చి వారిని విచారించగా, వారు దొంగ ఓటు వేయడానికి వచ్చినట్లు తేలింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు వ్యక్తులపై ఎన్నికల నియమావళి ప్రకారం సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఎవరైనా ఇతరుల ఓటు వేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ ఎస్ హెచ్ వో హెచ్చరించారు.


