కలం, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో (Bangladesh) కొన్ని నెలలుగా హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యాకాండపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) స్పందించారు. ఆ దేశానికి పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు తమపై జరుగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా ఎదురుతిరగాలని నిర్ణయించుకుంటే, మొత్తం ప్రపంచంలోని హిందువులందరూ వాళ్లకు అండగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముంబైలోని నెహ్రూ సెంటర్ ఆడిటోరియంలో జరుగుతున్న ‘వ్యాఖ్యన్మాల’ ఉపన్యాస కార్యక్రమంలో రెండో రోజూ మోహన్ భగవత్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆర్ఎస్ఎస్ దృక్పథాన్ని, పనితీరును వెల్లడించారు.
బంగ్లాదేశ్‌లో సంక్షోభం కారణంగా 2023లో అప్పటి ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకోవడం, అనంతరం విద్యార్థి ఉద్యమనేత ఉస్మాన్ హాదీ హత్యతో భారత వ్యతిరేక అల్లర్లు చెలరేగడం తెలిసిందే. ఆందోళనకారులు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతూ, హత్యలకు పాల్పడుతుండడంపై మోహన్ భగవత్ స్పందిస్తూ.. ‘బంగ్లాదేశ్‌లో దాదాపు 1.25 కోట్ల మంది హిందువులు ఉన్నారు. తమ హక్కుల కోసం ప్రతిఘటించాలని వాళ్లు అనుకుంటే, ప్రపంచంలోని హిందువులంతా వాళ్లకు సహాయంగా నిలబడతారు’ అని స్పష్టం చేశారు.
విచ్ఛిన్నం చేయాలనుకుంటే..
దేశంలో జనాభాలోని అసమతుల్యతకు కారణం గత ప్రభుత్వాల నిర్వాకమని మోహన్ భగవత్ (Mohan Bhagwat) వ్యాఖ్యానించారు. ‘గతంలో ప్రభుత్వాలు జనాభా మార్పుల విషయంలో ఏమీ చేయలేదు. ముఖ్యంగా జననాలు, అక్రమ చొరబాట్లను పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది విజయవంతం అవుతుంది’ అని ఆయన అన్నారు. భారత్‌ను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని, ఎవరైనా ఆ దిశగా ప్రయత్నిస్తే వాళ్లే విచ్ఛిన్నమైపోతారని భగవత్ హెచ్చరించారు.
కార్యకర్తలే నిధి..
ఆర్ఎస్ఎస్కు నిధుల విషయంలో ఎదురవుతున్న ప్రశ్నల గురించి మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్పొరేట్ లేదా సంస్థాగత ఆదాయం ఆధారపడి పనిచేయడం లేదని స్పష్టం చేశారు. ‘ఆర్ఎస్ఎస్కు ఫండింగ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఉంటుంది. దాని గురించి ఏం చెబుతున్నానంటే.. మాకు కార్యకర్తల సాయం రూపంలోనే ఫండ్స్ వస్తాయి. మేం, ఎక్కడికైనా వెళ్లినప్పుడు మాకు ఆతిథ్యం ఇచ్చేది వాళ్లే. హోటల్స్‌లో కాకుండా కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తాం. మేం ఆహారం అడుగుతాం. కానీ, ఆహారం కోసం డబ్బు అడగం’ అని ఆయన తెలిపారు.
కులం అడ్డు కాదు..
ఆర్ఎస్ఎస్ నాయకత్వ బాధ్యతలకు కులం ప్రామాణికం కాదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అలాంటి వివక్షను ఆర్ఎస్ఎస్ ప్రోత్సహించదన్నారు. ‘ఆర్ఎస్ఎస్ చీఫ్ కావడానికి బ్రాహ్మణులకు మాత్రమే అర్హత ఉంది.. ఎస్సీ, ఎస్టీలకు అర్హత లేదు అనేది అబద్దం. ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు కావచ్చు. సంస్థ ప్రస్థానం బ్రాహ్మణులతో మొదలైనప్పటికీ అన్ని కులాల కోసమూ పనిచేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
అందుకే ముస్లిం ఏరియాల్లో…
ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఘర్షణలు పెరగకుండా ఉండడం కోసమే ఆర్ఎస్ఎస్ అక్కడ పనిచేయడం లేదని మోహన్ భగవత్ అన్నారు. ‘ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో సవాళ్లను ఎదుర్కోవడమంటే వాటిపై స్పందించకపోవడమే. వాళ్లు పరుషపదాలు వాడినా మేం స్పందించం. కారణం.. ఘర్షణలు మరింత పెద్దవి కాకుండా చూడాలనే ప్రయత్నం’ అని ఆయన అన్నారు.
Read Also: భవిష్యత్ లో 35 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా భారత్ : పీయూష్ గోయల్
Follow Us On : WhatsApp


