కలం, వెబ్ డెస్క్: ఓ భారతీయ ఉపాధ్యాయురాలికి అరుదైన గౌరవం తగ్గింది. గ్లోబల్ టీచర్ (Global Teacher)గా ఎంపికై కోట్లాది రూపాయల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. దుబాయ్ (Dubai) వేదికగా జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్‌లో ఆమెకు ఈ బహుమతిని ప్రదానం చేశారు. భారతదేశ విద్యా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త రూబుల్ నాగీ (Rouble Nagi) ఈ అవార్డుతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆమెకు 2025వ సంవత్సరానికి గాను జెమ్స్ ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ లభించింది. ఈ అవార్డుతో పాటు ఆమెకు 10 లక్షల అమెరికన్ డాలర్లు (రూ.9.17 కోట్లు) బహుమతిగా అందించారు.
ఈ అవార్డును వార్కీ ఫౌండేషన్ (Varkey Foundation) ప్రారంభించగా.. యునెస్కో (UNESCO) సహకారంతో అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్య, సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించిన నాయకులు, విధాన రూపకర్తలను ఈ అవార్డు ద్వారా సత్కరిస్తారు. ఈ అవార్డు తరగతి గదులకే పరిమితం కాకుండా, సమాజంలోకి వెళ్లి చదువు కోసం కృషి చేసిన ఉపాధ్యాయులను గుర్తించి అందిస్తారు. రూబుల్ నాగీకి ఈ అవార్డు లభించడం ద్వారా ఆమె సేవలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు, భవిష్యత్తులో మరింత మంది ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తోంది. గత 20 ఏళ్లుగా రూబుల్ నాగీ విద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు.
ఆమె స్థాపించిన రూబుల్ నాగీ ఆర్ట్ ఫౌండేషన్ (Rouble Nagi Art Foundation) ద్వారా దేశవ్యాప్తంగా 800కు పైగా లెర్నింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఎక్కువ భాగం బస్తీ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాల కాలనీల్లో ఉన్నాయి. అక్కడ సరైన విద్యా సదుపాయాలు లేని పిల్లలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఈ కేంద్రాల్లో పాఠశాలకు వెళ్లని పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడంతో పాటు, ఇప్పటికే పాఠశాలల్లో చేరినా చదువులో వెనుకబడిన వారికి రిమీడియల్ ఎడ్యుకేషన్, సృజనాత్మక అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.
రూబుల్ నాగీ (Rouble Nagi) విద్యా విధానంలో “లివింగ్ వాల్స్ ఆఫ్ లెర్నింగ్” ప్రత్యేకంగా నిలిచింది. పాడుబడ్డ గోడలపై వేసిన రంగురంగుల చిత్రాల ద్వారా పిల్లలకు అక్షరజ్ఞానం, గణితం, సైన్స్, పరిశుభ్రత, చరిత్ర, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత వంటి అంశాలను నేర్పుతున్నారు. ఈ గోడలే పిల్లలకు పాఠశాలలుగా, ఉపాధ్యాయులుగా మారాయి. ఈ విధానం పిల్లలకే కాదు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలను కూడా ఆకట్టుకుంటోంది. రూబుల్ నాగీ స్వయంగా శిక్షణ పొందిన కళాకారిణి. శిల్పకళ, చిత్రకళ, ఇన్‌స్టాలేషన్లలో ఆమెకు విశేష అనుభవం ఉంది. గ్యాలరీల నుంచి బయటకు వచ్చి, బస్తీ ప్రాంతాల్లో కళను ప్రజలకు చేరువ చేశారు. రూబుల్ నాగీ మిసాల్ ముంబయి అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. 2016లో పెయింట్ ధారావిగా ప్రారంభమైన ఈ కార్యక్రమం తర్వాత ముంబయితో పాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇళ్లను శుభ్రం చేసి, రంగులు వేసి, స్థానికుల సహకారంతో వేలాది ఇళ్లను మార్చేశారు. రూబుల్ నాగీ చేసిన ఈ సేవలు విద్యను పుస్తకాలకే పరిమితం కాకుండా, జీవితంతో ముడిపెట్టి నేర్పించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పాయి. అందుకే ఆమెకు గ్లోబల్ టీచర్ ప్రైజ్ లభించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: పేరు ఏదైతేనేం..? పదవి ఉంటే చాలు..
Follow Us On : WhatsApp


