కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ డీఎస్పీ డి. ప్రణీత్ రావు(Praneeth Rao)పై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. క్రమశిక్షణారాహిత్యం, విధి నిర్వహణలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడినందుకు గాను ఆయనను డీఎస్పీ ర్యాంక్ నుంచి ఇన్‌స్పెక్టర్ ర్యాంక్‌కు తగ్గిస్తూ (Demote) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రణీత్ రావుపై ప్రధాన ఆరోపణలివే :
2016 నుంచి 2023 వరకు ఎస్ఐబీలో పని చేసిన ప్రణీత్ రావు, తన నేతృత్వంలోని ఎస్‌వోటీ కోసం ప్రత్యేక ఇంటర్నెట్ లీజు లైన్లను నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించుకున్నట్లు తేలింది. అలాగే విచారణలో భాగంగా తన కార్యాలయంలోని 42 హార్డ్ డిస్కులను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ముఖ్యమైన సాక్ష్యాలైన సీఆర్డీలు, ఐఎంఈఐ, ఐపీడీఆర్ డేటాను ఉద్దేశపూర్వకంగా చెరిపివేసినట్లు గుర్తించారు. దీంతో పాటు సీసీటీవీ కెమెరాలను ఆపి వేసి, ఎలక్ట్రీషియన్ సహాయంతో హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడం ద్వారా సాక్ష్యాలను మాయం చేశారని అదనపు డీజీపీ నివేదికలో పేర్కొన్నారు. ప్రణీత్ రావు ప్రవర్తన సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్, 1964లోని మూడవ నిబంధనను ఉల్లంఘించినట్లు ప్రభుత్వం పరిగణించింది. ఈ మేరకు మార్చి 2, 2024న ఆయనను సస్పెండ్ చేశారు. ప్రణీత్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అదే ఏడాది మార్చి 10న కేసు నమోదైంది. మార్చి 12న పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.
ప్రణీత్ రావు మార్చి 31, 2023న డీఎస్పీగా పదోన్నతి పొందారు. నిబంధనల ప్రకారం ఆయన ఏడాది పాటు ప్రొబేషన్ పీరియడ్‌లో ఉండాలి. అయితే, ఈ లోపే క్రిమినల్ కేసులో అరెస్ట్ కావడం, విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో ఆయన ప్రొబేషన్ కాలం సంతృప్తికరంగా పూర్తి కాలేదని నిర్ధారిస్తూ తిరిగి పాత పోస్టుకు సీఐగా డీమోట్ చేస్తూ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు.


