కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన వాంగ్మూలమే కీలకంగా మారిందా? ‘పెద్దాయన’ అంటూ చేసిన ప్రస్తావనే కేసీఆర్ (KCR)కు తలనొప్పిగా మారిందా? సీఎం ఇచ్చిన ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగిందా? మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఎపిసోడ్‌పై కేసీఆర్ గైడెన్స్ ఇచ్చారా? వీడియో రికార్డింగ్‌లో అప్పటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిని ట్రాప్‌గా వాడుకోవాలన్నది కేసీఆర్ ఆదేశమా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ అప్పటి ఇంటెలిజెన్స్ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. ఈ కారణంగానే మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారాన్ని సిట్ పోలీసులు ప్రస్తావించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదనే సమాచారం ముందుగానే ఎలా తెలిసింది అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. ట్యాపింగ్ వ్యవహారంలో సైతం కేసీఆర్ ఆదేశాల మేరకే అంటూ ఆ స్టేట్‌మెంట్‌లో రాధాకిషన్‌రావు పేర్కొనడం గమనార్హం.
ఢిల్లీ నుంచి కెమెరాల కొనుగోలు :
మొయినాబాద్ వ్యవహారాన్ని వీడియోలో రికార్డు చేయాలన్న ఆలోచన కేసీఆర్‌దేనని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పక్కా నిఘా వేయాలని సూచించారని రాధాకిషన్‌రావు ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. కెమెరాలను కొనుగోలు చేయడానికి శ్రీనాధ్‌రెడ్డి, శ్రీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్లను ఢిల్లీకి పంపించానని, ఫామ్ హౌజ్‌లో తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫిక్స్ చేశారని ఆ స్టేట్‌మెంట్‌లో వివరణ ఇచ్చారు. బీజేపీ ప్లాన్‌లో ఒక కీలక వ్యక్తి కేరళకు చెందినవారు కావడంతో ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి, ఓ ఇన్‌స్పెక్టర్ ఛార్టర్డ్ ఫ్లైట్‌లో వెళ్లినా పట్టుకోలేకపోయారని, ఆ తర్వాత ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో ‘పెద్దాయన’కు ఆగ్రహం, అసంతృప్తి కలిగిందన్న అంశాన్ని కూడా రాధాకిషన్‌రావు పేర్కొన్నారు. సర్వీసు నుంచి 2020లోనే తాను రిటైర్ అయినా ఆ తర్వాత కేసీఆర్ రీ-అపాయింట్‌మెంట్ చేశారని, అందువల్ల మరింత లోతైన విషయాలు వెల్లడించలేనని పేర్కొన్నారు. ఇవన్నీ కేసీఆర్‌ను సిట్ పోలీసులు ప్రశ్నించే సందర్భంగా ప్రస్తావించినట్లు తెలిసింది.
సునీల్ కనుగోలు ఆఫీస్ వివరాలూ లీక్ :
బీఆర్ఎస్ పార్టీపైనా, KCR పైనా రాజకీయ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్ రూమ్ సైబరాబాద్ లిమిట్స్ లో ఉన్న సమాచారాన్ని ఎస్ఐబీ సిబ్బందే ఇచ్చారని రాధాకిషన్‌రావు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రచారానికి ఆటంకం కలిగించాలన్న ఉద్దేశంతోనే రెయిడ్ చేసి కంప్యూటర్లు సీజ్ చేశామని, డేటాను తీసుకెళ్ళాల్సి వచ్చిందని, ఆ తర్వాత అవి ఏమయ్యాయో, ఆ కేసు ఏమైందో తనకు తెలియదని చెప్పారు. సరిగ్గా ఈ అంశాలనే ప్రతిపక్ష నాయకులే టార్గెట్‌గా అనే ప్రస్తావనతో కేసీఆర్‌ను సిట్ పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని తెలిసిన వెంటనే ప్రభాకర్‌రావు రిజైన్ చేశారని, తాను సైతం అదే రోజున రాజీనామా చేయాల్సి వచ్చిందని రాధాకిషన్ రావు పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకునే ప్రభాకర్‌రావుకు ఎందుకు ఎక్స్ టెన్షన్ ఇవ్వాల్సి వచ్చింది?.. రెండు కీలకమైన బాధ్యతలు ఎందుకు అప్పజెప్పాల్సి వచ్చింది?.. అంటూ కేసీఆర్ నుంచి సిట్ పోలీసులు సమాధానాన్ని రాబట్టినట్లు తెలిసింది.


