కలం, ఖమ్మం బ్యూరో : మున్సిపల్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ (Congress) శ్రేణులు సైనికుల్లా కదలాలని, సంక్షేమ పథకాలను ఆయుధాలుగా చేసుకుని ప్రతి ఇంటి గడపను తట్టాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పిలుపునిచ్చారు. ఆదివారం ఏదులాపురం (Yedulapuram) మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణపురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణ కుమారి అధ్యక్షతన జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల క్షేత్రంలో పార్టీ జెండా రెపరెపలాడడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
ఐక్యమత్యమే మహాబలం
అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం పోటీ ఉండటం సహజమని, అయితే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఐక్యంగా ముందుకు సాగాలని మంత్రి సురేఖ (Konda Surekha) సూచించారు. మున్సిపాలిటీలోని 32 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంపై ఆమె స్పందిస్తూ, మనలో మనమే కొట్లాడుకుంటే మూడో వ్యక్తి గెలిచే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. నేతలు చొరవ తీసుకుని అభ్యర్థులందరినీ ఏకతాటిపైకి తేవడం అభినందనీయమని పేర్కొన్న మంత్రి, వార్డుకు ఒక్కరే అభ్యర్థి ఉండేలా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
ప్రజాక్షేత్రంలో సంక్షేమ విజయాలు
మున్సిపాలిటీలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులతో రూపొందించిన కరపత్రాన్ని మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పెంపు వంటి పథకాలు ప్రతి కుటుంబానికి కొండంత భరోసా ఇచ్చాయని ఆమె గుర్తు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సారథ్యంలో పాలేరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, ఇదే ఊపుతో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుని ఆయనకు కానుకగా ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Read Also: మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి.. బీఆర్ ఎస్వీ నేతల అరెస్ట్
Follow Us On : WhatsApp


