కలం, వెబ్ డెస్క్ : పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలన్న ఆలోచన ప్రతి తల్లిదండ్రిలో ఉంటుంది. చదువు ఖర్చులు ప్రతీ సంవత్సరం పెరుగుతున్న వేళ, ముందుగానే సరైన ఆర్థిక ప్రణాళిక అవసరమనే భావన మరింత బలపడుతుంది. ఇలాంటి సమయంలో ఎన్‌పీఎస్ వాత్సల్య (NPS Vatsalya) పథకం మళ్లీ చర్చకు వచ్చింది. ఇటీవల ఎగ్జిట్ నిబంధనల్లో మార్పులు రావడంతో, ఈ పథకం పిల్లల విద్య అవసరాలకు సరిపోతుందా అనే ప్రశ్న తల్లిదండ్రులను ఆలోచనలో పడేసింది. పెరుగుతున్న స్కూల్ ఫీజులు, ప్రొఫెషనల్ కోర్సుల వ్యయాలు, విదేశీ చదువుల ఖర్చులు చూసినప్పుడు సాధారణ సేవింగ్స్ సరిపోవని చాలామంది భావిస్తున్నారు. దీర్ఘకాల పెట్టుబడులు మాత్రమే ఈ అవసరాలను తట్టుకోగలవన్న అభిప్రాయం బలపడుతుంది.
ఈ నేపథ్యంలో 2024లో పీఎఫ్ఆర్‌డీఏ (PFRDA) ప్రవేశపెట్టిన ఎన్‌పీఎస్ వాత్సల్య (NPS Vatsalya) పథకం ప్రత్యేకంగా మారింది. ఈ పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో పనిచేస్తుంది. చిన్న పిల్లల పేరుతో ఖాతా తెరవచ్చు. తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ ఈ ఖాతాను నిర్వహిస్తారు. పిల్లలు 18 ఏళ్లకు చేరుకున్న తర్వాత ఈ ఖాతా ఆటోమేటిక్‌గా వారి పేరున ఉన్న ఎన్‌పీఎస్ టయర్-I ఖాతాగా మారుతుంది. చిన్న వయసులోనే పొదుపు అలవాటు పెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇటీవల ప్రభుత్వం ఎగ్జిట్ నిబంధనల్లో మార్పులు చేసింది. పిల్లలు 18 ఏళ్లు పూర్తిచేసిన తర్వాత మొత్తం నిధిలో 80 శాతం వరకు ఒక్కసారిగా తీసుకునే అవకాశం కల్పించారు. మిగిలిన 20 శాతం మాత్రం అన్యూటీగా మార్చాల్సి ఉంటుంది. ఆ మొత్తం నెలవారీ పెన్షన్ రూపంలో మాత్రమే అందుతుంది.విద్యా నిధిగా ఈ పథకం సరిపోతుందా అనే సందేహాలు మొదలవుతున్నాయి.
ఉన్నత విద్య సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు ఒకేసారి అవసరం అవుతుంది. అలాంటి వేళ 20 శాతం మొత్తాన్ని లంప్‌సమ్‌గా తీసుకోలేని పరిస్థితి కొంతమందికి ఇబ్బందిగా మారవచ్చు. అలాగే లంప్‌సమ్ మొత్తంపై పన్ను మినహాయింపుల విషయంలో పూర్తి స్పష్టత లేకపోవడం మరో ప్రశ్నగా ఉంది. పాక్షిక ఉపసంహరణకు కూడా పరిమితులు ఉన్నాయి. పిల్లలు 18 ఏళ్లకు ముందూ, తర్వాతా కలిపి కొన్ని సార్లలోనే డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా మొత్తం పెట్టుబడిలో 25 శాతం వరకు మాత్రమే ఉంది. పెరుగుతున్న విద్యా ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే ఈ పరిమితులు చాలవని భావిస్తున్నారు.
Read Also: ఐటీ పన్నుల్లో మార్పుల్లేవ్
Follow Us On : WhatsApp


