కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారంలో కేసీఆర్‌ను (KCR) సిట్ (SIT) పోలీసులు ఏయే అంశాలపై ఆరా తీస్తారన్నది రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు విచారించినవారి నుంచి రాబట్టిన సమాచారాన్ని కేసీఆర్ ఎంక్వయిరీ సందర్భంగా ప్రస్తావించి ఆయన వివరణ తీసుకోనున్నారు. చివర్లో ఆయన స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2015 నుంచే కొనసాగుతున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు అప్పటి అంశాలను కూడా ప్రస్తావించే అవకాశమున్నది. ఒకవైపు పోలీసుల దగ్గర ప్రస్తుతం ఉన్న ఎవిడెన్సులతో పాటు ఇప్పటివరకు నిందితులుగా ఉన్న రిటైర్డ్ పోలీసు అధికారులు ఇచ్చిన వివరాలు కేసీఆర్ ఎంక్వయిరీలో కీలకం కానున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కస్టడీలోకి తీసుకుని రాబట్టిన అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశమున్నది.
ఆ మూడు అంశాలే విచారణలో కీలకం? :
ఫోన్ ట్యాపింగ్‌పై (Phone Tapping Case) విచారణ సందర్భంగా కేసీఆర్‌ను నిర్దిష్టంగా సమాధానాలను రాబట్టడానికి సిట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటికే ప్రశ్నావళిని రూపొందించుకున్నట్లు తెలిసింది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారాన్ని, 2015లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపుల వ్యవహారాన్ని, హరీశ్‌రావు ఫోన్ సంభాషణల అంశాలను సిట్ పోలీసులు ప్రస్తావించే అవకాశమున్నది. ఫోన్లను ట్యాపింగ్ చేయకపోతే ఈ సమాచారం ఇంటెలిజెన్స్ పోలీసులకు ముందుగానే ఎలా తెలిసిందనే అంశంపై కేసీఆర్‌ను లోతుగా ప్రశ్నించి సమాధానాన్ని రాబట్టే అవకాశమున్నది. పకడ్బందీగా సీసీటీవీలను ఏర్పాటు చేసి వీడియో రూపంలో రికార్డు చేసే మెకానిజం రూపొందించుకోడానికి ఏ సమాచారం దోహదం చేసిందంటూ ఆయన నోటి నుంచే చెప్పించేలా పోలీసులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వీటితో పాటు ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్న కొన్ని ఎవిడెన్సులను కూడా ఫిజికల్, ఎలక్ట్రానిక్ రూపంలో కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళడంపైనా ప్లాన్ చేసినట్లు తెలిసింది.
పొలిటీషియన్లు, జడ్జీల ఫోన్ ట్యాపింగ్ :
నిర్దిష్టంగా కొద్దిమంది వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేయకపోతే మొయినాబాద్ ఫామ్ హౌజ్, స్టీఫెన్సన్కు ముడుపుల విషయాలు తెలిశాయంటూ ప్రశ్నించే అవకాశమున్నది. బీజేపీ నేత బీఎల్ సంతోష్ ఆ వ్యవహారంలో సూత్రధారి అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిందించింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్వయంగా కేసీఆర్ (KCR) ప్రెస్‌మీట్ పెట్టి వీడియో ఫుటేజీని బహిర్గతం చేశారు. పలు హైకోర్టుల జడ్జీలకు సైతం పంపించారు. బీజేపీ నేతలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి వారి మధ్య జరిగిన వ్యవహారాన్ని ముందుగానే పసిగట్టిందన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. పక్కా ప్లాన్ ప్రకారమే సీసీటీవీ కెమెరాలను అమర్చి ఆ వ్యవహారాన్ని రికార్డు చేశారు పోలీసులు. దీనికి తోడు హరీశ్‌రావును ఇటీవల విచారించిన సందర్భంగా ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందన్న అంశాన్ని ఎవిడెన్సు రూపంలో చూపించినట్లు పోలీసు వర్గాల సమాచారం. కొద్దిమంది జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్లు వచ్చిన వార్తలు సంచలనం రేకెత్తించాయి.
డిపార్టుమెంటుదే బాధ్యతగా మారుతుందా? :
సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదుల లాంటి కొందరి ఫోన్లను ఇంటెలిజెన్స్ విభాగం ట్యాప్ చేయడం రోటీన్‌గా జరిగే ప్రాక్టీసేనంటూ హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్ (KTR) బహిరంగంగానే చెప్పారు. అయితే రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారితో పాటు సొంత పార్టీలోని కొందరు నేతల ఫోన్లను, వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాపింగ్ లిస్టులో చేర్చడంపై ఇప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర విమర్శలే జరుగుతున్నాయి. ట్యాపింగ్ ఆదేశాలను, వ్యక్తుల పేర్లను ఎవరిచ్చారు?.. ఎవరి ఆదేశం మేరకు సంబంధిత అధికారులకు చేరాయి?.. ఎంతమంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు?.. ఇలాంటివన్నీ కేసీఆర్ నుంచి విచారణ సందర్భంగా సిట్ పోలీసులు రాబట్టే అవకాశమున్నది. ట్యాపింగ్ బాధ్యత డిపార్టుమెంటుదేనని, అందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉండదంటూ కేటీఆర్ చెప్పినట్లుగానే కేసీఆర్ నుంచి కూడా అదే సమాధానం వస్తుందా అనే మాటలూ వినిపిస్తున్నాయి. ఎన్ని గంటల పాటు ఆయనను విచారిస్తారు?.. ఎలాంటి వివరాలను రాబడతారన్నది కీలకంగా మారింది.
Read Also: ఖేలో ఇండియా వింటర్ గేమ్స్: నయనా శ్రీకి డబుల్ గోల్డ్
Follow Us On: Pinterest


