కలం, నల్లగొండ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల (Municipal Polls) ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో నకిరేకల్ మినహా నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు మరో 16 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మూడు రోజులుగా నామినేషన్లు స్వీకరిస్తుండగా, శుక్రవారం గడువు ముగిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో 407 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో 48 వార్డులు, సూర్యాపేట-48, కోదాడ-35, మిర్యాలగూడ-48, హుజూర్ నగర్-28, భువనగిరి -35, హాలియా-12, భూదాన్ పోచంపల్లి-13, దేవరకొండ-20, చిట్యాల-12, మోత్కూర్-12, ఆలేరు-12, చండూరు-10, నేరేడుచర్ల-15, తిరుమలగిరి-15, యాదగిరిగుట్ట-12, చౌటుప్పల్-12 చొప్పున ఉన్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉండనుండగా, కొన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వనుంది. అక్కడక్కడా రెబల్స్ అభ్యర్థులు ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.
ఏ మున్సిపాలిటీ ఎవరికీ రిజర్వ్
ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలోని 17 మున్సిపాలిటీల పరిధిలో 6,68,455 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 3,23,613 మంది పురుష ఓటర్లు కాగా, 3,44,713 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే నల్లగొండ (మేయర్)- జనరల్ మహిళ, మిర్యాలగూడ- జనరల్ మహిళ, దేవరకొండ- బీసీ (మహిళ), చండూరు- జనరల్, నందికొండ (నాగార్జునసాగర్)- ఎస్సీ జనరల్, హాలియా- జనరల్, చిట్యాల- జనరల్ మహిళ, నకిరేకల్- జనరల్, భువనగిరి- జనరల్ మహిళ, చౌటుప్పల్- జనరల్ మహిళ, భూదాన్‌పోచంపల్లి- జనరల్, మోత్కూరు- ఎస్సీ(మహిళ), ఆలేరు- బీసీ మహిళ, యాదగిరిగుట్ట- జనరల్ మహిళ, సూర్యాపేట- జనరల్, కోదాడ- జనరల్ మహిళ, హుజూర్నగర్- బీసీ జనరల్, నేరేడుచర్ల- జనరల్, తిరుమలగిరి- జనరల్ స్థానాలను కేటాయించారు.
నల్లగొండ తొలి మేయర్ ఎన్నిక రసవత్తరం
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత తొలిసారిగా మేయర్ స్థానానికి ఎన్నికలు జరుగుతుండడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బుర్రి చైతన్యరెడ్డిని ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి చకిలం వసంత అనిల్‌కుమార్ పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. బీజేపీ (BJP) నుంచి మేయర్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 48 వార్డులకు 334 మంది అభ్యర్థులు 582 నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీల వారీగా చూస్తే.. కాంగ్రెస్ నుంచి 143 నామినేషన్లు, బీఆర్ఎస్- 134, బీజేపీ- 123, ఏఐఎంఐఎం – 17, బీఎస్పీ – 4, సీపీఎం – 4, ఆప్ – 1, ఇతర రిజిస్టర్డ్ పార్టీల నుంచి 56, స్వతంత్ర అభ్యర్థులు – 100 మంది నామినేషన్లు వేశారు.
నల్లగొండ జిల్లాలో 1795 నామినేషన్లు
నల్లగొండ జిల్లాలో 7 మున్సిపాలిటీల్లో 162 వార్డులకు 1795 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో 48 వార్డులకు 581 నామినేషన్లు, మిర్యాలగూడలో 48 వార్డులకు 507, దేవరకొండలో 20 వార్డులకు 254, నందికొండలో 12 వార్డులకు 95, హాలియాలో 12 వార్డులకు 135, చిట్యాలలో 12 వార్డులకు 106, చండూరులో 10 వార్డులకు 117 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి 631 నామినేషన్లు రాగా, బీఆర్ఎస్ (BRS) నుంచి 474, బీజేపీ 287, సీపీఎం 23, బీఎస్పీ 21, ఎంఐఎం 19, ఆప్ 7, టీడీపీ 2, ఇండిపెండేంట్లు 234, రిజిష్టర్డ్ పార్టీల నుంచి 97 నామినేషన్లు దాఖలయ్యాయి.
యాదాద్రిభువనగిరి జిల్లాలో 841 నామినేషన్లు
యాదాద్రిభువనగిరి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 104 వార్డుల్లో 841 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులకు 77, భువనగిరిలో 35 వార్డులకు 305, చౌటుప్పల్‌లో 20 వార్డులకు 191, మోత్కూరులో 12 వార్డులకు 107, పోచంపల్లిలో 13 వార్డులకు 84, యాదగిరిగుట్టలో 12 వార్డులకు 77 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి 271 నామినేషన్లు, బీఆర్ఎస్ నుంచి 237, బీజేపీ నుంచి 185, సీపీఎం నుంచి 19, సీపీఐ (CPI)-2, బీఎస్పీ-6, ఎంఐఎం-2, జనసేన-3, ఇండిపెండేంట్లు-94, రిజిష్టర్డ్ పార్టీల నుంచి 22 నామినేషన్లు దాఖలయ్యాయి.
సూర్యాపేట జిల్లాలో 1617 నామినేషన్లు
సూర్యాపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లోని 141 వార్డుల్లో 1617 నామినేషన్లు దాఖలయ్యాయి. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులకు 741 నామినేషన్లు, కోదాడలో 35 వార్డులకు 333, హుజూర్‌నగర్‌లో 28 వార్డులకు 293, నేరేడుచర్లలో 15 వార్డులకు 90 నామినేషన్లు, తిరుమలగిరిలో 15 వార్డులకు 160 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే సూర్యాపేట జిల్లాలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కనిపిస్తోంది. సూర్యాపేట మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే సూర్యాపేట మున్సిపాలిటీని ఏలాగైనా కైవసం చేసుకునేందుకు మంత్రి ఉత్తమ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.
అధికార పార్టీకి రెబల్స్ దడ
ఉమ్మడి నల్లగొండ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా రెబల్స్ బెడద కన్పిస్తోంది. సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీ ఎన్నికలు తొలిసారి జరుగుతుండడంతో ఆశావాహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ బీ ఫామ్ దక్కనివాళ్లు రెబల్స్‌గా రంగంలోకి దిగారు. ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్నప్పటికీ ఎన్నికల్లో టికెట్లను ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఇచ్చిన చోట రెబల్స్ బెడద విపరీతంగా ఉంది. ఇక బీఆర్ఎస్ (BRS) విషయానికొస్తే.. కొన్ని మున్సిపాలిటీల్లో మినహా మిగతా చోట్ల పోటీ చేసేందుకు బీఆర్ఎస్కు అభ్యర్థులు దొరకడం గగనమైంది. అభ్యర్థులను బతిమిలాడి పోటీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బీజేపీ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ పూర్తిస్థాయిలో పోటీ చేస్తున్న పరిస్థితి లేకపోవడం కొసమెరుపు. ఇదిలావుంటే.. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో రెబల్స్ బుజ్జగింపుల పర్వం కొనసాగనుంది.


