కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. వనపర్తి (Wanaparthy) జిల్లా కొత్తకోటలోని బీసీ బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని సుమారు 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి హాస్టల్‌లో భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు వరుసగా వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. పరిస్థితి విషమించడంతో హాస్టల్ సిబ్బంది వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం వనపర్తి (Wanaparthy) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో విద్యార్థినులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆహారం కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఒకేసారి ఇంతమంది విద్యార్థినులు అనారోగ్యానికి గురికావడంతో తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


