కలం, డెస్క్ : మేడారం మహాజాతర (Medaram Jatara) మొదలైంది. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల మీదకు చేరుకున్నారు. లక్షల్లో భక్తులు మేడారానికి తరలివెళ్తున్నారు. అయితే చాలా మంది అక్కడకు కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు మర్చిపోయి వెళ్లి ఇబ్బంది పడుతున్నారు. జాతరలో వాటికి వేలల్లో ధరలు పెట్టలేక సతమతం అవుతున్నారు. కాబట్టి అక్కడకు వెళ్లేవారు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వస్తువులు వెంటపెట్టుకుని వెళ్లాలి, ఎలాంటి టూరిస్టు ప్లేసులు ఉన్నాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం.
రూట్ మ్యాప్స్, పార్కింగ్ స్థలాలు
-కరీంనగర్ మీదుగా వచ్చేవారు..
రామగుండం, కాళేశ్వరం నుంచి వచ్చేవారంతా కాటారం, పెగడపల్లి, కాల్వపల్లి మీదుగా ఊరట్టం పార్కింగ్ స్థలానికి చేరుకోవాలి. ఈ పార్కింగ్ స్థలం నుంచి తిరుగు ప్రయాణం చేసేవారు ఊరట్టం నుంచి నార్లాపూర్, కమలాపూర్ టీ-జంక్షన్ మీదుగా వెళ్తే ట్రాఫిక్ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
-ఖమ్మం, భద్రాద్రి నుంచి వచ్చేవారు..
ఖమ్మం, భద్రాద్రి మీదుగా మేడారం వచ్చేవారు ఏటూరు నాగారం, కొండాయి రోడ్డు మార్గం గుండా ఊరట్టం పార్కింగ్ స్థలానికి చేరుకోవచ్చు.
-హైదరాబాద్, నల్గొండ నుంచి వచ్చేవారు..
హైదరాబాద్, నల్గొండ నుంచి వచ్చేవారంతా వరంగల్ మీదుగా ములుగు, పస్రా, నార్లాపూర్ మీదుగా మేడారంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలానికి చేరుకోవాలి.
పార్కింగ్ స్థలాలు ఇవే..
ప్రభుత్వం భక్తుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసింది. ఏ రూట్ నుంచి వచ్చేవారికి ఆయా రోడ్లకు ఆనుకుని పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. జంపన్నవాగు (Jampanna Vagu) పార్కింగ్, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, చింతల్, నార్లాపూర్, వెంగళాపూర్ పార్కింగ్ స్థలాల్లో మీ వెహికల్స్ పార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవి మిమ్మల్ని గద్దెల దాకా తీసుకెళ్తాయి. రూట్ మ్యాప్స్, పార్కింగ్ స్థలాల కోసం ప్రభుత్వం రూపొందించిన క్యూఆర్ కోడ్ తో పాటు వాట్సాప్ నెంబర్లలో తెలుసుకోండి.
మేడారం వాట్సాప్ నెంబర్లు..
మేడారం జాతరకు (Medaram Jatara) సంబంధించిన వాట్సాప్ నెంబర్లను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. +91 7658912300 లేదా 76589 12300 నెంబర్లకు వాట్సాప్ లో మీకు అవసరమైన విషయాలను అడిగి తెలుసుకోవచ్చు.
ఫుడ్, వాటర్..
మేడారం వెళ్లేవారు కచ్చితంగా రెండు రోజులకు సరిపడే ఫుడ్ మీ వెంట తీసుకెళ్తే బెటర్. వెళ్లే రోజు ఫ్రెష్ గా ఉండేవి.. ఇంకో రోజు కోసం నిల్వ ఉండే తినే వస్తువులు తీసుకెళ్తే బెటర్. ఉదాహరణకు చపాతీలు రెండు రోజులైనా పాడైపోవు. వాటితో పాటు ఇంకా చిరుతిండిలాంటివి తీసుకెళ్లండి. ఇక వాటర్ కూడా సరిపడా ఇంటి నుంచే తీసుకెళ్లండి. జాతరలో తాగునీరుకు భారీ డిమాండ్ ఉన్నందున.. వందల్లో వెచ్చించాల్సిందే.
ఫోన్ ఛార్జింగ్, పవర్ బ్యాంక్ కంపల్సరీ..
జాతరకు వెళ్లేవాళ్లు కచ్చితంగా ఇంటివద్దే ఫోన్లు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి. అలాగే పవర్ బ్యాంక్ లు వాటి కేబుల్స్ వెంట తీసుకెళ్లండి. అక్కడ ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా మీకు పవర్ బ్యాంక్ ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మేడారంలో ఫోన్ ఛార్జింగ్ పాయింట్ల వద్ద భారీగా రేట్లు ఉన్నాయి. పైగా సమయం కూడా ఎక్కువ పడుతుంది.
డ్రెస్సులు, దుప్పట్లు..
మేడారం వెళ్తే ఇంటికి తిరిగి రావడానికి కనీసం రెండురోజులైనా సమయం పడుతుంది. పైగా అడవిలో చలి ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి కప్పుకోడానికి దుప్పట్లు తీసుకెళ్లండి. మర్చిపోతే చలిలో ఇబ్బంది పడాల్సిందే. ఒక జత బట్టలు ఎక్కువగా పట్టుకెళ్లండి.
మెడిసిన్స్..
జాతరలో లక్షల్లో జనాలు ఉంటారు. కాబట్టి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే హెల్త్ క్యాంపుల వద్దకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆలోపు మీకు ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీ రాకుండా ఉండేందుకు.. మీకు అవసరమైన మెడిసిన్ వెంటపెట్టుకెళ్లాలి. మీకు ఆల్రెడీ ఏదైనా హెల్త్ సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన మెడిసిన్ తో పాటు.. పిల్లలతో వెళ్తే వారికి సంబంధించినవి కూడా తీసుకెళ్లండి.
మొక్కుల కోసం..
సమ్మక్క, సారలమ్మలకు అనేక మొక్కులు చెల్లించుకుంటారు. బెల్లం, కొబ్బరికాయలు, ఇతర మొక్కు చెల్లించుకునే వస్తువులను ఇంటి దగ్గరే కొనేయండి. జాతరలో వీటి రేట్లు మామూలుగా లేవు. ఇక మేకలు, కోళ్లతో ఎదుర్కోలు ఇవ్వడం ఆనవాయితీ. కాబట్టి మేడారం వెళ్లే ముందే మేకలు లేదా కోళ్లను ఇంటి దగ్గరి నుంచే తీసుకెళ్లండి. జాతరలో కిలో మటన్ రూ.1500, చికెన్ కిలో రూ.800 దాకా ఉన్నాయి.
టూరిస్టు ప్లేసులు..
మేడారం వెళ్తున్న వారు ఇంకొన్ని టూరిస్టు ప్లేసులు కూడా చూడొచ్చు. ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం టూరిస్టులకు మంచి అనుభూతి ఇస్తుంది. వరంగల్ లో ఉన్న లక్నవరం సరస్సులో బోటింగ్, కేబుల్ వేలాడే బ్రిడ్జి లాంటివి ఉన్నాయి. బొగత వాటర్ ఫాల్స్ కూడా వెళ్లొచ్చు. వీటితో పాటు ఏటూరునాగారం అభయారణ్యం, మేడారం ఆదివాసీ మ్యూజియం లాంటివి చూడొచ్చు.
Read Also: ఎన్నికల రాష్ట్రాలపై నిర్మలమ్మ ప్రేమ !
Follow Us On: X(Twitter)


