కలం, వెబ్ డెస్క్ : జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ పీజీఈసెట్ 2026 (TG PGECET–2026) సంబంధించిన తొలి సెట్ కమిటీ సమావేశం జనవరి 30(శుక్రవారం) న JNTUH వైస్ ఛాన్సలర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి JNTUH వీసీ ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి, TGCHE చైర్మన్ వి. బాలకిష్టా రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ పీజీఈసెట్ 2026 పరీక్షా షెడ్యూల్‌ను కమిటీ ఆమోదించింది. ఫిబ్రవరి 23 (సోమవారం) నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఫిబ్రవరి 27 (శుక్రవారం) నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు మే 6 (బుధవారం) చివరి తేదీగా నిర్ణయించారు. పరీక్షలు మే 28 (గురువారం) నుంచి మే 31(ఆదివారం) వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో సహకరిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు కృతజ్ఞతలు తెలియజేసిన కన్వీనర్ డా. కె. వెంకటేశ్వరరావు, తెలంగాణ పీజీ సెట్ 2026 షెడ్యూల్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని మీడియాను కోరారు.


