కలం, వరంగల్ బ్యూరో : ఆదివాసీ నృత్యాలు, సంగీతం, మేళతాళాలు, డప్పు చప్పుల్ల మధ్య కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం (Medaram) గద్దెలపై కొలువు దీరింది. ఆదివాసీ పూజారులు వారి సంప్రదాయాల ప్రకారం బుధవారం సాయంత్రం కన్నెపల్లికి చేరుకున్నారు. ముందుగా సారలమ్మను అలంకరించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో భాగంగా అమ్మకు నైవేద్యం సమర్పించి, పుష్పాలు చల్లి దీపాలు వెలిగించారు. అనంతరం కాలి నడకన సారలమ్మను జంపన్న వాగు మీదుగా గద్దెల పైకి చేర్చారు. ఇదే క్రమంలో పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజు గద్దెలకి తీసుకువచ్చారు. దీంతో అధికారికంగా జాతర ప్రారంభమైనట్లు పూజారులు ప్రకటించారు. ఈ ఘట్టంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


