కలం, వెబ్‌డెస్క్: టీ20 సిరీస్‌లో భారత్ జోరుకు అడ్డుకట్ట పడింది. ఆల్‌రౌండర్ శివమ్ దూబే (Shivam Dube) మెరుపు అర్ధ సెంచరీ(65; 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) తో విరుచుకుపడినప్పటికీ, మిగిలినవాళ్లు చేతులెత్తేయడంతో నాలుగో టీ20లో పరాజయం పాలైంది. బుధవారం విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 50 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి జట్టు టిమ్ సీఫర్ట్(62; 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీకి తోడు డెవాన్ కాన్వే(44; 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిచెల్ మార్ష్(39 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్(24; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో 215/7 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా, బుమ్రా, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో భారత్ ఆరంభం నుంచే తడబడింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే అభిషేక్ శర్మ(0) గోల్డ్‌న్ డక్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(8) సైతం ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో సంజు శాంసన్(24; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్), రింకు సింగ్(39; 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే, వీళ్లిద్దరితోపాటు హార్థిక్ పాండ్యా(2) వెంట వెంటనే వెనుదిరగడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో హర్షిత్ రాణా తోడుగా శివమ్ దూబే (Shivam Dube) సిక్సర్ల సునామీతో చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు.
దూబే క్రీజులో ఉన్నంత సేపూ భారత్ గెలుపుపై అభిమానుల్లో ఆశలు చిగురించాయి. కానీ, రాణాతో సమన్వయం లోపం కారణంగా దూబే రనౌట్ కావడం ఆశలపై నీళ్లు చల్లింది. ఆ తర్వాత కాసేపటికే భారత్ ఇన్నింగ్స్ 18.4లో 165 పరుగుల వద్ద ముగిసింది. కివీస్ బౌలర్లలో శాంట్నర్ 3, ఇష్ సోధి, జాకబ్ డఫీ చెరో 2 వికెట్లు తీశారు. మ్యాట్ హెన్రీ, జకరీ ఫోక్స్‌కు చెరో వికెట్ దక్కింది. ఈ గెలుపుతో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని కివీస్ 3–1కి తగ్గించింది. ఐదో టీ20 తిరువనంతపురం వేదికగా ఈ నెల 31న జరగనుంది.


