కలం, తెలంగాణ బ్యూరో : ఆసక్తిగా ఎదురుచూసిన మున్సిపల్ ఎన్నికల (Municipal Polls) షెడ్యూలు రానే వచ్చింది. ఆశావహుల్లో, పార్టీ నేతల్లో సంతోషం వ్యక్తమైంది. తొందరగా ముగుస్తున్నాయని సంబరపడిపోయారు. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. నామినేషన్లు దాఖలు చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కేవలం మూడే రోజులు గడువు ఇచ్చింది. షెడ్యూలు విడుదల చేసిన మరుసటి రోజు నుంచే నామినేషన్ల పర్వం మొదలైంది. దీంతో అన్ని పార్టీల్లో అభ్యర్థుల్ని ఫైనల్ చేయడం సవాలుగా మారింది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతుండడంతో విజయావకాశాలు ఉన్నవారిని గుర్తించడం, అభ్యర్థుల్ని ఫిల్టర్ చేసి ఫైనల్ చేయడం, రెబల్ అభ్యర్థుల్ని బుజ్జగించడం, ఇతర పార్టీలకు దీటుగా ప్రజాదరణ ఉన్నవారిని నిలబెట్టడం.. ఇవన్నీ మూడే రోజుల్లో ముగించడం ఒకింత ఇబ్బందికరంగా మారింది.
సర్వే రిపోర్టు ఫైనల్ కాకుండానే… :
పంచాయతీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల పోటీ కారణంగా దాదాపు 760 స్థానాల్లో బలపర్చిన అభ్యర్థుల్ని గెలిపించుకోలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Polls) రెబల్ అభ్యర్థులతో చిక్కులు రాకుంగా ఐదు ప్రైవేటు సర్వే సంస్థలను కాంగ్రెస్ రంగంలోకి దించింది. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత సీఎం, పీసీసీ చీఫ్ సమీక్షించి అభ్యర్థుల్ని ఖరారు చేయాలని తొలుత అనుకున్నా ఆకస్మికంగా ఎలక్షన్ షెడ్యూలు రావడంతో ప్లాన్ తలకిందులైంది. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, ఇన్చార్జి మంత్రి, జిల్లా మంత్రులతో మాట్లాడి అభ్యర్థుల విజయావకాశాలపై చర్చించి ఫైనల్ చేయడం అనివార్యమైంది. రెబల్ అభ్యర్థుల్ని బుజ్జగించే బాధ్యత కూడా జిల్లా నేతలే చేపట్టాల్సి వస్తున్నది. సీఎం నగరానికి రావడానికి ముందే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగియనున్నది.
బీఆర్ఎస్, బీజేపీల్లోనూ ఇదే సమస్య :
గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒకరి చొప్పున ఇన్చార్జిలను నియమించింది. గతంలో పోటీచేసి గెలిచిన, ఓడిన అభ్యర్థుల్ని ఇన్చార్జిలు పరిశీలించి ఈసారి తప్పకుండా గెలవడానికి అవకాశం ఉన్నవారిని ఖరారు చేయాల్సి వస్తున్నది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు పూర్తికావడంతో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఒక స్పష్టతకు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 35 మున్సిపాలిటీలను కైవశం చేసుకుంటామన్న ధీమా వ్యక్తమవుతున్నది. ఇక బీజేపీ విషయంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు, జిల్లా నాయకత్వం చర్చించి అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో మొత్తం 123 మున్సిపల్ బాడీల్లో దాదాపు 2,996 మంది అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి వస్తున్నది. ప్రచారానికి కూడా కేవలం 13 రోజులే గడువు ఉన్నది. ఇందులో నామినేషన్లు ముగిసేంత వరకూ ప్రచారం ఊపందుకునే పరిస్థితి లేదు. దీంతో కేవలం వారం రోజుల వ్యవధిలోనే మొత్తం ప్రచారాన్ని కంప్లీట్ చేయడం అనివార్యమవుతున్నది.


