కలం, వెబ్ డెస్క్: వికారాబాద్(Vikarabad)లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి తన ప్రేమ కోసం తల్లిదండ్రుల(Parents)ను హతమార్చింది. కులాంతర వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్‌లోని బంటారం మండలం యాచారానికి చెందిన నక్కల సురేఖకు సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అబ్బాయితో స్నేహం ఏర్పడింది. కొద్ది రోజులకు వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. సురేఖ తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పింది. అబ్బాయి వేరే కులానికి చెందిన వ్యక్తి కావడంతో తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో సురేఖ తల్లిదండ్రులపై కక్ష పెంచుకుంది. ఎలాగైనా తల్లిదండ్రులను చంపేసి ప్రియుడితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
సురేఖ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. తాను పని చేసే ఆస్పత్రిలోనే అనస్థీషియా ఇంజెక్షన్లను దొంగిలించింది. అలాగే ఈ నెల 24న స్థానిక మెడికల్ షాప్‌లో మూడు సిరంజీలు కొనుగోలు చేసింది. తల్లిదండ్రులకు ఒళ్లు నొప్పులు తగ్గించే మందు అని చెప్పి ఎక్కువ డోస్ లో మత్తుమందు ఇచ్చి చంపేసింది. అనంతరం ఇది సాధారణ మృతిగా అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించింది. పోలీసులకు అనుమానం రావడంతో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. మత్తుమందు ఎక్కువ డోస్ ఇవ్వడంతోనే సురేఖ తల్లిదండ్రులు మృతి చెందారని వికారాబాద్ డీఎస్పీ వెల్లడించారు. నిందితురాలు సురేఖను అదుపులోకి తీసుకున్నారు.


