epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

అశ్వాపురంలో భారీ ఆక్సిజన్–18 ప్లాంట్

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అశ్వాపురం (Aswapuram) మండల కేంద్రానికి మరో కీలక జాతీయ స్థాయి ప్రాజెక్ట్ రాబోతుంది. ఇప్పటికే ఉన్న భార జల (హెవీ వాటర్) ప్లాంట్‌కు అనుబంధంగా ఆక్సిజన్–18 (Oxygen-18 Plant) ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. సుమారు రూ.160 కోట్ల వ్యయంతో, 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. జనవరి 31న భారత అణుశక్తి కమిషన్ (ఏఈసీ) ఛైర్మన్ అజిత్‌కుమార్ మొహంతి ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా, ఆక్సిజన్–18ను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి.

ఇది రెండో ప్లాంట్..

ఇప్పటికే 2022లో అశ్వాపురంలో రూ.50 కోట్లతో 10 లీటర్ల సామర్థ్యంతో తొలి ఆక్సిజన్–18 ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, ఇజ్రాయెల్, రష్యాల తర్వాత ఆక్సిజన్–18 ఉత్పత్తి చేసే ఆరో దేశంగా భారత్ నిలిచింది. ఆ ప్లాంట్ ప్రస్తుతం విజయవంతంగా పనిచేస్తుంది. దాని ఫలితంగానే ఇప్పుడు భారీ సామర్థ్యంతో మరో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

క్యాన్సర్ చికిత్సలో కీలకం

ఆక్సిజన్ ఐసోటోపుల్లో 16, 17, 18 రకాలు ఉండగా, సాధారణ నీటిలో ఆక్సిజన్–18 కేవలం 0.2 శాతం మాత్రమే ఉంటుంది. ప్రత్యేక శాస్త్రీయ పద్ధతుల ద్వారా దీన్ని 95.5 శాతం వరకు శుద్ధి చేస్తారు.ప్రత్యేకంగా క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో ఆక్సిజన్–18 కీలక ట్రేసర్‌గా ఉపయోగపడుతోంది. ఇటీవల అమెరికా, ముంబైలో జరిగిన పరిశోధనల్లో దీని ప్రాధాన్యత మరింత స్పష్టమైంది. దీంతో వైద్య, శాస్త్రీయ రంగాల్లో దీని వినియోగం వేగంగా పెరుగుతోంది.

కిలో ధర లక్షల్లో

ప్రస్తుతం ఒక గ్రాము ఆక్సిజన్–18 ధర రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంది. అశ్వాపురంలో 100 కిలోల సామర్థ్యంతో ప్లాంట్ ప్రారంభమైతే దేశీయ అవసరాలు తీరడమే కాకుండా, భారీ ఎగుమతుల ద్వారా ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>