కలం, వెబ్ డెస్క్: మేడారం మహా జాతర (Medaram Jatara) ప్రారంభమైంది. జాతరలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకుందామని కుటుంబసభ్యులతో వారంతా ట్రాక్టర్‌లో సంతోషంగా బయలుదేరారు. అంతలోనే రోడ్డు ప్రమాదం(Accident) వారి సంతోషాన్ని చెరిపేసింది. ట్రాక్టర్(Tractor) బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్‌లో ఉన్న వారంతా గాయపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబం మంగళవారం రాత్రి ట్రాక్టర్‌లో మేడారం జాతరకు బయలుదేరింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండలం కేశవపూర్ శివారులోకి చేరుకోగానే ప్రమాదవశాత్తు వీరి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మృతులను ముత్తంపేటకు చెందిన తల్లీ కూతుళ్లు లక్ష్మి(45), అక్షిత(21)లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాదంతో మేడారం దారిలో 4 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

Read Also: చెరువుకు గండి.. నీళ్ళు, ఇసుకతో నిండిన పంట పొలాలు
Follow Us On: Pinterest


