కలం, వెబ్ డెస్క్ : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయన మీడియా ముందుకొచ్చారంటే ఏదో ఒక బాంబు పేల్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్ టార్గెట్ గా ఆయన చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఏపీ రాజకీయాల్లో చర్చలకు దారి తీస్తున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలో విజయసాయిరెడ్డి చెప్పినా.. ఆయన అంతర్గత వ్యూహం వేరే ఉందని తెలుస్తోంది. ఆయన మొన్న ఈడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ రాజకీయ వేదిక మీదకు వెళ్తాననేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. కానీ చూస్తుంటే విజయసాయిరెడ్డి ఏ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది.
టీడీపీ, జనసేనలోకి కష్టమే..?
వైసీపీలో తనకు అవమానం జరిగిందని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. పైగా మాజీ సీఎం జగన్ ను నేరుగానే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి తిరిగి ఫ్యాన్ పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేదు. టీడీపీ, జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా.. ఆ పార్టీలు విజయసాయికి పెద్ద పొజీషన్ ఇస్తాయనే నమ్మకం లేదు. ఎందుకంటే వైసీపీలో ఉన్నంత కాలం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను విజయసాయిరెడ్డి ఎంతగా టార్గెట్ చేశారో.. ఎలాంటి ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందే. పైగా ఆ పార్టీల్లోనే సీనియర్లకు అవకాశాలు రాక ఎదురు చూస్తున్నారు. కాబట్టి విజయసాయికి అక్కడ అనుకున్నంత స్పేస్ లేదు.
ప్రతిపక్షంలో స్పేస్ ఉందా..
అంతర్గత సమాచారం ప్రకారం విజయసాయిరెడ్డి సొంత పార్టీ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారంట. రెడ్డి సామాజిక వర్గ మద్దతు తనకు కలిసొస్తుందని.. ప్రతిపక్షంలో ప్రస్తుతం వైసీపీ ఒక్కటే ఉంది కాబట్టి.. తనకు స్పేస్ ఉందని భావిస్తున్నారంట. కూటమి ఇంకో 15 ఏళ్లు కలిసే ఉండాలని భావిస్తోంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న స్పేస్ ను వాడుకుని.. తన రాజకీయ అనుభవం, పరిచయాలు, ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసుకుని కొత్త పార్టీకే మొగ్గు చూపుతున్నారంట. వైసీపీలో ఇప్పటికీ విజయసాయిరెడ్డికి ఓ వర్గం ఉందనేది ఓపెన్ సీక్రెట్. ఆయన కోరితే వైసీపీని వీడి తన కొత్త పార్టీలో బలమైన నాయకులే చేరుతారని విజయసాయిరెడ్డి ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
వాళ్లు వస్తారని..
ఉన్న ఎమ్మెల్యే సీట్లను కూటమిలోని మూడు పార్టీలు పంచుకుంటున్నాయి కాబట్టి.. ఆ పార్టీల్లో అసంతృప్తులు భారీగానే పెరుగుతున్నారు. వాళ్లను ఈజీగా తన పార్టీలోకి తీసుకుంటే.. కొత్త పార్టీకి బలం పెరగడానికి ఎంతో టైమ్ పట్టకపోవచ్చని విజయసాయిరెడ్డి తన వర్గీయులతో ఆలోచన చేస్తున్నారు. పైగా వైసీపీ ప్రభతుత్వంలో నెంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి వల్ల ఎంతో మంది లబ్దిపొందారని.. వాళ్లంతా ఇప్పుడు కొత్త పార్టీకి మద్దతు ఇస్తారనే ప్రచారం కూడా ఉంది.
ఆల్రెడీ ఐదు పార్టీల పోరు
ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే ఐదు పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్టే సాగుతున్నాయి. ఇన్ని పార్టీల నడుమ కొత్త పార్టీని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు అంటే అనుమానమే. పైగా విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) పొలిటికల్ వ్యూహాల వరకే ఇప్పటి దాకా పరిమితం అయ్యాడు. కానీ ప్రజల్లో ఆయనకు బలమైన ఇమేజ్ లేదు. కాబట్టి అంత త్వరగా ఏపీ ప్రజలు ఆయన్ను ఆదరించకపోవచ్చు అంటున్నారు పొలిటికల్ మేథావులు. పోనీ ఇంకో 10 లేదా 15 ఏళ్ల దాకా పోరాడి అయినా అధికారంలోకి పార్టీని తెస్తారా అంటే.. ఆయన వయసు కూడా అడ్డుగా వస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో మూడేళ్ల టైమ్ ఉంది. కానీ ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వడం కూడా కష్టమే. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చనే సామెత ప్రకారం.. విజయసాయిరెడ్డి కొత్త దారిలో నడుస్తారా లేదంటే పాత పార్టీల్లో దేనికైనా జై కొడుతారా చూడాలి.
Read Also: సీఎం చంద్రబాబు అబద్ధాలు వినలేకపోతున్నాం : మాజీ మంత్రి రోజా
Follow Us On : WhatsApp


