epaper
Friday, January 23, 2026
spot_img
epaper

శబరిమల గోల్డ్​ స్కామ్​ దోషులను జైలుకు పంపిస్తాం: ప్రధాని మోదీ

కలం, వెబ్​డెస్క్​: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం చోరీ (Sabarimala Gold Scam) కి పాల్పడిన దోషులను జైలుకు పంపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అనంతరం ‘వికసిత కేరళం’ పేరుతో జరిగిన బహిరంగ సభలో పీఎం మాట్లాడారు.

‘దేశవ్యాప్తంగా అందరికీ అయ్యప్పస్వామిపై అంతులేని నమ్మకం ఉంది. కానీ, కేరళలోని ఎల్​డీఎఫ్ (LDF)​ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శబరిమల సంప్రదాయాలను దెబ్బతీయడంలో వెనుకాడడంలేదు. ఇప్పుడు ఏకంగా ఆలయం నుంచి బంగారం చోరీకి గురైంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తాం. దోషులను జైలుకు పంపిస్తాం’ అని ప్రధాని అన్నారు.

కాగా, అయప్ప స్వామి ఆలయం ప్రధాన గర్భగుడి మరమ్మతుల సమయంలో 4.54కిలోల బంగారం అపరిహరణకు గురైనట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే (Sabarimala Gold Scam). దీనిపై ప్రస్తుతం సిట్​ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసింది. ఈ క్రమంలో కేరళకు వచ్చిన ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు.

కేరళలో మార్పు తథ్యం..

ఏళ్ల తరబడి కొనసాగిన ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్ (UDF)​ పరిపాలనలో కేరళ అభివృద్ధి పరంగా ఎంతో వెనకబడిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ప్రస్తుతం కేరళ మార్పు అంచున నిలిచిందని పేర్కొన్నారు. దీనికి తిరువనంతపురం కార్పొరేషన్​ ఎన్నికలు శ్రీకారం చుట్టాయని చెప్పారు. ఇక్కడ బీజేపీ విజయం చారిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. కేరళలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడానికి ఈ విజయం పునాది వేసిందన్నారు.

‘ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్​ అవినీతి నుంచి కేరళను విడిపించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ప్రజలు తీసుకున్న సంకల్పానికి తిరువనంతపురం విజయం నిదర్శనం. అందుకే, రాబోయే ఎన్నికలు కేరళ దశ, దిశ మార్చేవి. ఇప్పటివరకు మీరు ఒకవైపు ఎల్‌డీఎఫ్, మరోవైపు యూడీఎఫ్​ను మాత్రమే చూశారు. ఈ రెండు కూటములు ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వస్తూ కేరళను నాశనం చేశాయి. కానీ, ఇప్పుడు మూడో మార్గం మీ ముందు ఉంది. అదే అభివృద్ధి, సుపరిపాలనకు చిహ్నమైన బీజేపీ–ఎన్‌డీఏ ప్రభుత్వం. ఇక నిర్ణయం మీదే’ అని ప్రధాని మోదీ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>