epaper
Friday, January 23, 2026
spot_img
epaper

మేడారం.. మహా అద్భుతం

కలం, వరంగల్ బ్యూరో : మేడారం (Medaram) మహాజాతర ప్రాశస్థ్యం మరో 200 ఏళ్లు చెక్కుచెదరకుండా చక్కని శిలలతో అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్నది. 930 ఏళ్ల నాటి కోయ జాతి తాళ పత్రాల గ్రంథాల్లోని విశేషాలతో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల ఘన చరిత రాతి శిలల రూపంలో లిఖితమవుతున్నది. గ్రానైట్తో గద్దెలు, చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలు.. 750 కోయ వంశాల ఇంటి పేర్లు తెలిసేలా 7 వేల చిహ్నాలు, గొట్టు, గోత్రాలకు ప్రతిరూపమైన సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంకలతోపాటు ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా వారు పూజించే చెట్టూ, పుట్ట, జంతువుల చిహ్నాలతో గ్రానైట్ రాయిపై ఏర్పాటు చేసిన చిత్రాలతో మేడారం మహా జాతర గుడి ప్రాంగణం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది.

ఆకర్శిస్తున్న ప్రధాన ద్వారం

సమ్మక్క-సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు, గద్దెల ముందు గ్రానైట్ రాళ్లతో నిర్మిస్తున్న ప్రధాన ద్వారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. 50 ఫీట్ల వెడల్పు, 25 ఫీట్ల 2 ఎత్తు, 5 వెడల్పుతో రెండు వైపులా రెండేసి పెద్ద 80 ఫీట్ల పొడవైన అడ్డుస్తంభం, దానిపైన మరో 60 ఫీట్ల పొడవైన అడ్డు స్తంభాన్ని ఏర్పాటు చేశారు. వీటితో పాటు గద్దెల చుట్టూ 25 ఫిట్లు ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో 8 రాతి స్తంభాలను అమర్చుతున్నారు. వీటిపై సమ్మక్క-సారలమ్మతో పాటు మూడు నుంచి ఏడు గొట్టు, గోత్రాలను బొమ్మ లుగా చెక్కారు. సమ్మక్క-సారలమ్మ పూర్వీకులు, కోయల జీవన శైలి తెలిసేలా 7వేల బొమ్మలను గ్రానైట్ రాళ్ల పైనా ఏర్పాటు చేశారు.

రాతి స్తంభంపై కోయజాతి చిత్ర భావించే ఒంటి కొమ్ము దుప్పి బొమ్మను జాతర ప్రధాన శిలగా భావించే స్వాగత తోరణంలోని పై స్తంభంలో అగ్ర భాగాన చెక్కించారు. దాని పక్కన అడవి దున్న కొమ్ములతో పాటు వాటిపై ఆరు నెమలి ఈకలను పొందుపర్చనున్నారు. కోయజాతిలో ముఖ్యమైన బేరంబోయిన రాజు(పశుపతి) 6వ గొట్టు ప్రతిరూపంగా గిరిజనులు నేటికీ నెమలి ఈకలను ధరించి నృత్యాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. దీంతోపాటు గోవిందరాజుల ప్రధాన గద్దె లపై వెంకన్న నామాలు, స్వస్తిక్, శంఖు చిత్రాలతో ” పాటు పలుచోట్ల శివలింగాలను చెక్కించారు.

శిలలపై చిత్రాలు

సమ్మక్క తల్లి గద్దెలకు చేరుకునే ప్రధాన ద్వారం అడ్డం 2వ వరుసలో 18 దుప్పుల చిహ్నాలు, నెల వంక, ఏనుగు చిత్రం, ఆదిశక్తి, పులి, తూతకొమ్ము, చక్రం, రంబ నాగుపాము, కలకోడి. కలకతామరపువ్వు, సూర్యచంద్రులు, జింక, సింహం, మనుబోతు, త్రిశూలం, ఒంటి కొమ్ము దుప్పి, ఖడ్గమృగం, ఎద్దు, ఎండిముక్కు కోబాడి, పైడి ముక్కు కొకాడి వంటి చిత్రాలను చెక్కించి శిల్పాలను అమర్చుతున్నారు.

ఇక సమ్మక్క తల్లి కొలువు ఉండే చిలుకల గుట్ట వైపు నిర్మిస్తున్న స్వాగత తోరణంపై ఏర్పాటు చేస్తున్న 59 బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి సమ్మక్క దైవమైన ఒంటి కొమ్ము దుప్పి చిత్రాలను చెక్కారు. ఇందులో సమ్మక్క వంశీయులు మూలాలు, కోయజాతి సంస్కృతి, సాంప్రదాయాలు, వారు దైవంగా కొలిచే పక్షులు, జంతువులకు సంబంధించిన బొమ్మలను గ్రానైట్ రాళ్లపైన ఏర్పాటు చేస్తున్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో భక్తులకు స్వాగతం తెలిపేందుకు సమ్మక్క – సారలమ్మ వీరత్వాన్ని తెలిపే విధంగా ఆర్చిని ఏర్పాటు చేశారు.

మేడారంలో చిలుకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెకు వచ్చే దారితోపాటు జంపన్నవాగు నుంచి భక్తులు గద్దెలకు చేరుకొనే మార్గంలో హరిత హోటల్ జంక్షన్ వద్ద ప్రత్యేక ఐలాండ్ లను ఏర్పాటు చేసి, మేడారం (Medaram) జాతర విశిష్టత తెలిపే థీమ్ తో నిర్మిస్తున్న నిర్మాణాలు అకట్టుకుంటున్నాయి. మేడారం గుడి, పునరుద్ధరణ పనులు పూర్తయితే మేడారం ప్రాంగణం జాతరకు వచ్చే భక్తులకు నూతన శోభతో స్వాగతం పలుకనున్నది.

ముందస్తు మొక్కులతో సందడి

ముందస్తు మొక్కులతో మహాజాతరకు ముందే మేడారం (Medaram) భక్తులతో కిటకిటలాడుతున్నది. ఆది, బుధవారాల్లో లక్షమంది భక్తులు వచ్చి గద్దెలను దర్శించుకుంటున్నారు. ఓ పక్క గుడి విస్తరణ పనులు మరోవైపు ముందస్తు మొక్కుల భక్తుల రద్దీతో మేడారం అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో  జరగడం లేదని పూజారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>