కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్లో నిజామాబాద్(Nizamabad) నార్త్ మండల కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) సందర్శించారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, తరగతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? లేదా? అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను సందర్శించి ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి, విద్యార్థినుల సామర్ధ్యాన్ని అంచనా వేశారు.
కలెక్టర్ తానే స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టుల్లో పలు అంశాలను బోర్డుపై రాసి బాలికలకు బోధించారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లను విద్యార్థినులకు అందించారు. బాలికలను ఆప్యాయంగా పలకరిస్తూ, ఇష్టపడి చదువుకోవాలని వారిలో స్పూర్తిని పెంపొందింపజేశారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్ తదితరులు ఉన్నారు.


