కలం, వెబ్ డెస్క్ : పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు స్టేషన్ల చుట్టూ తిరిగే పని లేకుండా, నేరం జరిగిన ప్రదేశంలోనే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC)లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిపి సజ్జనార్ (CP Sajjanar) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలు, దొంగతనాలు జరిగినప్పుడు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళిన వెంటనే, బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితులను అనవసరంగా పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఇబ్బంది పెట్టకూడదని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల బాధితులకు సకాలంలో న్యాయం అందడంతో పాటు పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ నిబంధనలను పాటించని అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో జవాబుదారీతనం ఉండాలని, పౌర కేంద్రీకృత విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఒకవేళ ఎక్కడైనా పోలీసులు ఈ విధానాన్ని పాటించకుండా బాధితులను ఇబ్బంది పెడితే, ప్రజలు నేరుగా 94906 16555 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సిపి సజ్జనార్ (CP Sajjanar) సూచించారు.


