కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఇసుక రవాణా, సరఫరా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, నియంత్రిత విధానంలో అమలు చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ (Mana Isuka Vahanam) ఆన్‌లైన్ సాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఇసుక అక్రమ రవాణా, నిల్వలు, అవినీతి వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ కొత్త విధాన ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న ఈ విధానాన్ని ముందుగా పైలట్ ప్రాజెక్ట్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపికైంది.
ఇకపై జిల్లాలో ఇసుక సరఫరా పూర్తిగా ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారానే జరగనుంది. ఇందిరమ్మ ఇండ్లు, గృహ నిర్మాణ పనులు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సహా అన్ని అవసరాల కోసం మాన్యువల్ కూపన్లు పూర్తిగా రద్దు కానున్నాయి. ప్రతి అనుమతి, ప్రతి రవాణా, ప్రతి లావాదేవీ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది. ఇందులో ఎలాంటి మానవ జోక్యం ఉండదు. మండలాల వారీగా ఇసుకకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా తక్షణమే ఇసుక లభ్యత ఉన్న రీచ్‌లను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అందుకనుగుణంగా అధికారులు గుర్తించిన రీచ్‌ల వివరాలు, రవాణా సామర్థ్యం, రోజువారీ సరఫరా వివరాలను సమగ్రంగా ఏడి మైన్స్ కార్యాలయానికి నివేదిస్తే ఇసుక కొరత లేకుండా ప్రజలకు సకాలంలో సరఫరా చేయవచ్చు.
ఈ కొత్త విధానం సమర్థవంతంగా అమలవ్వాలంటే అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డీవోలు, పంచాయతీ సెక్రటరీలు సహా జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు ఈ వ్యవస్థపై పూర్తి స్థాయిలో ఇప్పటికే శిక్షణ పొందారు. ఈ ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు పారదర్శకంగా, వేగంగా, నమ్మకంగా, అవినీతి రహితంగా ఇసుక లభ్యత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తారు.
ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMDC) అధికారులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డీవోలు, పంచాయతీ సెక్రటరీలకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ వ్యవస్థ పని విధానం, ఇసుక బుకింగ్ విధానం, రవాణా అనుమతులు, జీపీఎస్ ట్రాకింగ్, చెల్లింపుల విధానం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ వంటి అంశాలపై విస్తృతంగా వివరించారు.
మన ఇసుక వాహనం అంటే..
మన ఇసుక వాహనం అనేది తెలంగాణ ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న ఒక వెబ్, మొబైల్ అప్లికేషన్ దీని ద్వారా ప్రజలు తమ ఇంటి వద్దనే ఇసుకను బుక్ చేసుకోవచ్చు. అలాగే ట్రాక్టర్ డ్రైవర్లు తమ రోజువారీ పనులను నిర్వహించవచ్చు. ఈ యాప్ ఇసుక బుకింగ్, చెల్లింపులు, డెలివరీ ట్రాకింగ్, కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. Google Play Storeలో “Mana Isuka Vahanam” అని సెర్చ్ చేసి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


