కలం, నల్లగొండ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు.. భాష మారలేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) అన్నారు. నల్లగొండ బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటినుండి సామాన్య ప్రజలే కాదు ఆ పార్టీ నాయకులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
బొగ్గు కుంభకోణం, కాంగ్రెస్ పార్టీ స్కాంలను ఎండగట్టినందుకే హరీశ్ రావుపై అక్రమ కేసు బనాయించిందని, కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే హరీశ్ రావుకి రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చినా సిగ్గులేని రేవంత్ రెడ్డి సర్కార్ మళ్లీ విచారణ అంటూ హరీశ్ రావుని ఇబ్బందులు పెడుతుందని తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, ఎలక్షన్స్ వస్తేనే కెసిఆర్ పై కాళేశ్వరం కేసు, కెటిఆర్ పై ఫార్ములా ఈ రేసు కేసు, హరీశ్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటూ వేధిస్తోందని చిరుమర్తి (Chirumarthi Lingaiah) మండిపడ్డారు.
ఇన్నిసార్లు నల్లగొండ జిల్లాకు వచ్చినా ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి అని, అధికారం, ధనం, పోలీసు యంత్రాంగంతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నడుపుతుందని ఎద్దేవా చేశారు. కోదాడలో దళితబిడ్డ కర్ల రాజేష్ మృతికి పోలీసులే కారకులయ్యారని, రాజేష్ మృతికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనీ పాతాళంలో కలిపి మళ్లీ తెలంగాణలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీనీ తీసుకురావడం ఖాయమని చెప్పారు.


