epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

పాక్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ మాటలతో ఇబ్బంది పడ్డా: ట్రంప్​

కలం, వెబ్​డెస్క్​: పాకిస్థాన్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ మాటలతో తాను ఇబ్బంది పడినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump – Shehbaz)​ వ్యాఖ్యానించారు. దావోస్​ వేదికగా జరుగుతున్న వరల్డ్​ ఎకనమిక్​ ఫోరమ్​ సమ్మిట్​లో గురువారం ట్రంప్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాజా శాంతి కోసం రూపొందించిన 20 అంశాల ప్రణాళికను, గాజా శాంతి మండలి చార్ట్​ (Gaza Board of Peace) ను ఆవిష్కరించారు. అనంతరం ట్రంప్​ మాట్లాడారు. తన రెండో పదవీ కాలంలో ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు మళ్లీ చెప్పుకొచ్చారు. అందులో పాకిస్థాన్​, భారత్​ యుద్ధం కూడా ఉందన్నారు.

‘ఎనిమిది యుద్ధాలను, సంఘర్షణలను ఆపేశా. కొన్నింటి గురించి నాకు కూడా ముందు తెలియదు. భారత్, పాకిస్థాన్​ మధ్య యుద్ధం ఆపినందుకు చాలా సంతోషించా. అణు శక్తి కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం ఆపకపోతే పరిస్థితి తీవ్రంగా ఉండేది. ఈ యుద్ధం ఆపడం ద్వారా 10 నుంచి 20 మిలియన్ల మంది ప్రాణాలు కాపాడానని పాకిస్థాన్​ ప్రధాని షహబాజ్​ షరీఫ్​ పొగిడారు. ఆ వ్యాఖ్యలతో ఇబ్బంది పడ్డా. కానీ, ఆ తర్వాత ఆయన అలా చెప్పడం నాకు ఎంతో గౌరవంగా అనిపించింది’ అని ట్రంప్ (Trump – Shehbaz)​ అన్నారు.

గత ఏడాది భారత్​లోని పహల్గామ్​లో ఉగ్రదాడి అనంతరం భారత్​, పాక్​ మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం తెలిసిందే. ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్​ ‘ఆపరేషన్​ సింధూర్​’ చేపట్టింది. పాకిస్థాన్​లోని చాలా చోట్ల ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారత్​, పాక్​ మధ్య నాలుగు రోజుల పాటు స్వల్ప యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని తానే ఆపినట్లు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించుకున్న ట్రంప్​ దావోస్​ వేదికగా మరోసారి అదే పాట పాడారు.

శాంతి మండలిలో పాక్​:

అమెరికా ఆధ్వర్యంలో రూపొందించిన గాజా శాంతి మండలిలో పాక్​ సభ్య దేశంగా చేరింది. ఇందులో ఇప్పటివరకు 19 దేశాలు సభ్యులుగా చేరాయి. ఇందులో చేరాలని ​ట్రంప్​ ఆహ్వానించినప్పటికీ భారత్​ అంగీకారం తెలపలేదు. రష్యా, చైనా సైతం సమ్మతించలేదు. ఈ శాంతి మండలి కేవలం గాజా పునర్మిర్మాణం మాత్రమే కాకుండా ప్రపంచంలోని మిగిలిన సమస్యలపైనా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ‘గాజాతో సహా అనేక అంశాల్లో ఐక్యరాజ్యసమితి విఫలమైంది. గాజా శాంతి మండలి అన్నింటినీ పరిష్కరిస్తుంది’ అని ట్రంప్​ వ్యాఖ్యానించడం దీనికి సంకేతంగా భావిస్తున్నారు.

కాగా, గాజా శాంతి మండలిలో పాకిస్థాన్​ చేరడంపై సోషల్​ మీడియా వేదికగా నెటిజన్లు చెలరేగిపోతున్నారు. దేశంగా అవతరించినప్పటి నుంచి ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ఉన్న పాక్​ను శాంతి మండలిలో చేర్చుకోవడంపై జోకులు పేలుస్తున్నారు. అంతేకాదు, శాంతి మండలిలో చేరే ప్రతి దేశం 1 బిలియన్​ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అప్పులతో, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ప్రపంచ బ్యాంకు, గల్ఫ్​ కంట్రీస్​, చైనా వద్ద అప్పు తీసుకుంటున్న పాకిస్థాన్​.. ఆ సొమ్ము ఎలా చెల్లిస్తుందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Read Also: ఆస్ట్రేలియాలో కాల్పులు.. ముగ్గురి మృతి..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>