కలం వెబ్ డెస్క్ : విమానయాన రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన సర్గాడ్ (Sargad) సంస్థ రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో దశలవారీగా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో సర్గాడ్ సంస్థ అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.
దావోస్(Davos)లో జరుగుతున్న సదస్సులో సర్గాడ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనివాస్ తోట, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. తెలంగాణలో విమానాల నిర్వహణ, మరమ్మతులు, పునరుద్ధరణ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని సంస్థ ప్రతినిధులు వ్యక్తం చేశారు. సర్గాడ్ సంస్థకు ఏరోస్పేస్, రక్షణ, ఆటోమొబైల్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో విశేష అనుభవం ఉంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను మూడు ప్రత్యేక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సేవల రంగానికి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE), తయారీ రంగానికి పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE), వ్యవసాయం, గ్రీన్ ఎకానమీకి రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ (RARE)లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రాంతాల్లో ఏదైనా ఒక చోట ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం రేవంత్ సంస్థ సీఈఓకు సూచించారు.
వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి అత్యధిక ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం రేవంత్ వారికి హామీ ఇచ్చారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ పెట్టుబడులతో తెలంగాణలోని ఎంఎస్ఎంఈ లకు పరికరాల తయారీ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


