కలం, నల్లగొండ బ్యూరో : రాజమండ్రి(Rajahmundry)లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం(Road Accident) నల్లగొండ(Nalgonda) జిల్లాలో కలవరం రేపింది. జిల్లా నుంచి విహారయాత్ర కోసం వెళ్లిన ఓ విద్యార్థుల బృందానికి పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు సమీపంలోని గుండ్లపల్లి మోడల్ స్కూల్‌కు చెందిన 9, 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు మూడు రోజుల క్రితం విహార యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. 80 మంది విద్యార్థులతో పాటు పది మంది టీచర్లు, ఇతర సిబ్బంది రెండు బస్సుల్లో వెళ్లారు. వీరంతా ఏపీలోని అరకు, పాడేరు, అన్నవరం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం మంగళవారం రాత్రి రాజమండ్రి వైపు వెళ్తుండగా దివాన్ చెరువు పరిధిలోకి చేరగానే ఓ ట్రావెల్స్ బస్సుకు గేదె అడ్డు వచ్చింది. దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో విద్యార్థులు ప్రయాణిస్తున్న రెండు బస్సులు, వాటి వెనుక వస్తున్న మరో ట్రావెల్స్ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బస్సుల్లోని 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన విద్యార్థులను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి మిగిలిన విద్యార్థులను దివాన్ చెరువులోని బాలవికాస్ కేంద్రానికి పంపారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.


