కలం, నిజామాబాద్ బ్యూరో : ‘శ్రీరాముడికి బీజేపీలో సభ్యత్వం ఉందని నేను నమ్ముతున్నాను.. ఎవరైనా కాదనగలరా?’ అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నిజామాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును ఎన్నాళ్ళు విచారిస్తారని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వడం ప్యాకేజీ మాట్లాడుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి పరిపాటే అని తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు అనేక మందితో పాటు తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి ఎలా అవుతాయని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లు మేయర్ కాలేరని.. కార్పొరేషన్ లోని 60 లో ఇద్దరు కూడా గెలవరని జోస్యం చెప్పారు.
నిజామాబాద్ కాంగ్రెస్ లో మేయర్ కోసం పోటీ పడే వారు పెద్ద బకరా అవుతారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికలు రాగానే పతంగ్ వాళ్ళు వచ్చేస్తారు.. రెచ్చగొట్టి పోతారు.. మళ్ళీ ఐదేళ్ల దాకా రారని మండిపడ్డారు. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో మరోసారి దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తంచేశారు. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు, పెద్ద నాయకులు ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లాంటి పనులు సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎంపీ అరవింద్ (MP Arvind) విమర్శించారు.


