కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను వదిలేసి కేవలం కమీషన్లకే ప్రాధాన్యం ఇస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి, నైనీ కోల్ బ్లాక్ అంశాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 40 శాతం కమీషన్ సర్కార్ గా మారిందని, కీలక ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీస్తూ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు. సింగరేణి, నైనీ కోల్ బ్లాక్ విషయంలో బీఆర్‌ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన ఖండించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒకే బాటలో నడుస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని వాస్తవాలను వివరించారు. తెలంగాణ ప్రజా సంపదను, రాష్ట్ర హక్కులను కాపాడటం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతుందని రాంచందర్ రావు (Ramchander Rao) పేర్కొన్నారు.


