కలం, వెబ్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబిన్ (Nitin Nabin), మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర సీనియర్ నాయకులు హాజరయ్యారు. నితిన్ నబిన్ బీజేపీ చరిత్రలో అతి చిన్న వయస్కుడైన (45) జాతీయ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు.
బీహార్ కు చెందిన నితిన్ నబిన్ (Nitin Nabin) గతంలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. బంకిపూర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణాలు, న్యాయశాఖ, పట్టణాభివృద్ధి వంటి శాఖల మంత్రిగా పనిచేశారు. బీజేపీ యువ మోర్చా నుంచి రాజకీయంగా ఎదిగిన ఆయన సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. జనవరి 19న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నితిన్ నబిన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది.


