కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ జెన్‌కోలో (TS Genco) పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయడానికి జనరల్ ట్రాన్స్ ఫర్ పాలసీ ఉనికిలోకి వచ్చింది. ఈ నెల చివరికల్లా బదిలీ ప్రక్రియను పూర్తి చేసేలా గైడ్‌లైన్స్ విడుదలయ్యాయి. డిప్యూటీ ఇంజనీర్ మొదలు అసిస్టెంట్ ఇంజినీర్ వరకు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మొదలు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వరకు ఇంజినీరింగ్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో బదిలీలు జరగనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే బదిలీ ప్రక్రియ ముగుస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) కుదరదని టీఎస్‌జెన్‌కో తాజా సర్క్యులర్‌లో పేర్కొన్నది. బదిలీల్లో 25% మెడికల్ గ్రౌండ్స్ ప్రకారం, మరో 25% స్పౌజ్ కేటగిరీ ప్రకారం, మిగిలిన 50% వ్యక్తిగత కారణాలతో ఉంటాయని వివరించింది. ఏయే స్థాయి అధికారులకు బదిలీకి అవసరమైన అర్హతలను కూడా ఆ ఉత్తర్వుల్లో జెన్‌కోలో పేర్కొన్నది.
బదిలీకి అవసరమైన అర్హతలు ఇవే :
• అన్ని స్థాయిల్లోని అధికారుల బదిలీకి గతేడాది మార్చి 31 కటాఫ్ తేదీగా ఉండనున్నది.
• ఇంజినీరింగ్ విభాగంలో డిప్యూటీ ఇంజినీర్ మొదలు అసిస్టెంట్ ఇంజినీర్ వరకు, అకౌంట్స్ సెక్షన్‌లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మొదలు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వరకు పదేండ్ల పాటు హెడ్ క్వార్టర్ (కార్పొరేట్ కార్యాలయం)లో పనిచేసి ఉండాలి. సర్వీసు మధ్యలో బ్రేక్ వచ్చినా ఆ కాలాన్ని పరిగణనలోకి వస్తుంది. విద్యుత్ సౌధ లేదా ఈఆర్‌పీ కార్యాలయాల్లో పనిచేసినా ఆ సర్వీసు పరిగణనలోకి వస్తుంది.
• విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న జనరేషన్ స్టేషన్లలో పనిచేస్తున్నవారికి 15 ఏండ్లపాటు అక్కడే పనిచేసిన సర్వీసు తప్పనిసరి. అప్పుడే వారు కార్పొరేట్ ఆఫీసుకు బదిలీ కావడానికి ఆస్కారం ఉంటుంది.
• డిప్యూటేషన్‌పై జీహెచ్ఎంసీ లేదా ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నట్లయితే ఆ కాలాన్ని కార్పొరేట్ ఆఫీసులో పనిచేస్తున్నట్లుగానే పరిగణనలోకి వస్తుంది.
• విద్యుత్ సౌధలో పనిచేస్తున్న మెకానికల్, ఎలక్ట్రికల్, టెలికామ్, కంప్యూటర్ సెక్షన్ తదితర విభాగాల్లోని ఉద్యోగులను ఒకే కేటగిరీగా పరిగణిస్తారు. సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉద్యోగులను మరో కేటగిరీగా పరిగణిస్తారు. కానీ వీరందరినీ కార్పొరేట్/ఈఆర్‌పీ ఆఫీసుగా ఒకే యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుంటారు.
• ఇప్పటికే బదిలీ అయిన ఉద్యోగుల విషయంలో తదుపరి జనరల్ ట్రాన్స్ ఫర్ పాలసీ వరకు అవకాశాలు ఉండవు. ఇప్పుడు పనిచేస్తున్న చోట నాలుగేండ్ల సర్వీస్ పూర్తయిన తర్వాతే తదుపరి జనరల్ ట్రాన్స్ ఫర్ పాలసీకి అర్హత ఉంటుంది.
• స్టేట్, జోనల్ కేడర్ అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.

Read Also: జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్ నామినేషన్
Follow Us On : WhatsApp


