కలం, ఖమ్మం బ్యూరో : సీపీఐ శతాబ్ది ఉత్సవాల (CPI Centenary Celebrations) ముగింపు సభ సందర్భంగా ఖమ్మంలో (Khammam) కామ్రేడ్స్ కదం తొక్కారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలతో ఖమ్మం పుర వీధులు కిటకిటలాడాయి. ప్రతి ఒక్కరూ అరుణ పతాకాన్ని చేతబూని ఎర్రని వస్త్రాలు ధరించి ఖమ్మంకు తరలి రావడంతో ఖమ్మం ఎర్రబారింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే సుదూర ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు ఖమ్మం చేరుకున్నారు. నాగపూర్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలు సభకు హాజరయ్యారు. ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారులన్ని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల రాకతో దిగ్బంధించబడ్డాయి. ఎటు చూసినా అరుణ పతాక రెపరెపలే కనిపించాయి.
ఖమ్మం నగరంలోకి చేరుకునేందుకు ట్రాఫిక్ జామ్ కావడంతో కిలో మీటర్ల కొద్ది నడిచి కార్యకర్తలు ఎస్ఆర్అండ్్బజిఎన్ఆర్ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకున్నారు. వందలాది వాహనాల్లో పార్టీ కార్యకర్తలు తరలి రావడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో యువత తరలి రావడం విశేషం. జనసేవాదళ్ కార్యకర్తలే కాకుండా బహిరంగ సభకు వచ్చిన వారిలో యువత ఎక్కువగా ఉన్నారు. క్రమశిక్షణగా మూడు కిలో మీటర్ల మేర నడిచి బహిరంగ సభా స్థలికి చేరుకున్న యువత నాయకుల ఉపన్యాసాలకు, ప్రజానాట్యమండలి పాటలకు అలిసి పోకుండా కేరింతలు కొట్టారు. వందేమాతరం శ్రీనివాస్ అలపించిన ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నియాల్లో పాటకు యువత ఊగిపోయింది. పూనకం వచ్చినట్లుగా బహిరంగ సభా స్థలి మొత్తం అరుణ పతాకాలను ఊపుతూ ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించారు.
యువత ఊపు చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఒక్కింత ఆశ్చర్య పోయారు. యువత హాజరైన తీరు చూస్తుంటే వందేళ్లు కాదు మరో వందేళ్లయినా సమ సమాజం కోసం కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం కోసం పోరాడతామన్న భావన స్ఫురించింది. వందేళ్ల ఉత్సవాలు చూడాలని వందల కిలో మీటర్ల మేర ప్రయాణించి 70 నుంచి 80ఏళ్లు పైబడిన వృద్దులు, గతంలో కమ్యూనిస్టు పార్టీలో పని చేసిన ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నాయకత్వం సభకు హాజరయ్యారు.
మూడు ప్రదర్శనలు.. వేల మంది జనం
బహిరంగ సభ (CPI Centenary Celebrations) సందర్భంగా ఖమ్మంలో మూడు ప్రదర్శనలు నిర్వహించారు. మొదటి ప్రదర్శన పెవిలియన్ మైదానం నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జనసేవాదళ్ కార్యకర్తలు ఖమ్మం పుర వీధుల్లో కదం తొక్కారు. వరుసుకు నలుగురు చొప్పున నిలబడిన ప్రదర్శన రెండు కిలో మీటర్ల మేర ఉండడంతో ప్రదర్శనను పెద్ద సంఖ్యలో నగర పౌరులు తిలకించారు. ముఖ్యంగా యువ మహిళల కవాతు ఆకట్టుకుంది. చిన్నారులు కదం తొక్కుతూ లెఫ్ట్ రైట్ అంటూ నడుస్తూ ఉత్తేజాన్ని ఇచ్చారు. పదేళ్ల లోపు బాలలు సైతం ప్రదర్శనలో పాల్గొని భవిష్యత్తు తరం మాదేనంటూ మరో వందేళ్లయినా కమ్యూనిస్టు పార్టీకి డోకా లేదని తమ కవాతుతో నిరూపించారు.
జనసేవాదళ్ కార్యకర్తల కవాతుకు సిపిఐ అగ్ర నేతలు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, గుజ్జుల ఈశ్వరయ్య, చాడ వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం, బాగం హేమంతరావు తదితరులు నేతృత్వం వహించారు. జనసేవాదళ్ కార్యకర్తల తర్వాత సింగరేణి కార్మికులు, యువ మహిళలు, పర్ష పద్మ నేతృత్వంలో నాగళ్లు చేతబూనిన రైతులు కోయ, లంబాడ, జానపద నృత్య కళాకారులు, వందలాది మంది డప్పు కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. బతుకమ్మలతో మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ తర్వాత న్యాయవాదులు, వైద్యులు, యువజన, విద్యార్థి సమాఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇటీవల కాలంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిలో ప్రదర్శన సాగింది. ఖమ్మం నయాబజర్ కళాశాల నుండి మరో ప్రదర్శన ప్రారంభమైంది. నయాబజార్ కళాశాల నుండి ప్రారంభమైన ప్రదర్శన మయూరి సెంటర్, జడ్పి సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్డు మీదుగా సభా స్థలికి చేరుకుంది. ఈ ప్రదర్శనకు రాష్ట్ర సహాయ కార్యదర్శి తకెళ్లపల్లి శ్రీనివాసరావు, బోస్, కె. శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తదితరులు నేతృత్వం వహించారు. మూడవ ప్రదర్శన శ్రీశ్రీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైంది. శ్రీశ్రీ విగ్రహం నుంచి రోటరీ నగర్, మమత రోడ్డు, ఇల్లందు క్రాస్ రోడ్డు మీదుగా సభా స్థలికి చేరుకుంది. జాతీయ సమితి సభ్యులు ఎస్కె సాబీర్పాషా, సిపిఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి తదితరులు నేతృత్వం వహించారు.
Read Also: రాష్ట్ర సర్కార్ సరికొత్త రికార్డు!
Follow Us On: Instagram


