epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

అవన్నీ కట్టుకథలు, పిట్టకథలు.. సింగరేణి టెండర్ల వివాదంపై భట్టి

కలం, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థకు ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌కు (Naini Coal Block) సంబంధించిన టెండర్ల విషయంలో తన ప్రమేయం ఉన్నట్లుగా వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. పత్రికలో వచ్చిన కథనాలన్నీ కట్టుకథలు, పిట్టకథలేనని అన్నారు. “అది రాసిన ఆంధ్రజ్యోతి జర్నలిస్టు రాధాకృష్ణకు దివగంత వైఎస్సార్‌తో విభేదం, కోపం ఉండొచ్చేమో.. దానికి కొనసాగింపుగా టెండర్ల వ్యవహారంలో నా పేరును ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో నేను, ఆయన తేల్చుకుంటాం. ఆయనకు ఎవరిమీదనైనా ప్రేమ ఉండొచ్చు… అందుకే రాసి ఉండొచ్చు..” అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవం విషయంలో తాను రాజీపడే ప్రసక్తే లేదని, రాధృకృష్ణ తరహాలో నోటికొచ్చినట్లు మాట్లాడడం తనవల్ల కాదని, తనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయన్నారు.

అధికారం, హోదా కోసం పాలిటిక్స్ లోకి రాలేదు :

“నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఒక నిర్దిష్టమైన లక్ష్యం కోసం. నాకు వ్యాపారాన్ని విస్తరించుకోవాలన్న వాంఛ లేదు. అధికారాన్ని, హోదాను అనుభవించాలన్న ఆశ లేదు. రాష్ట్రంలో ఉన్న ఆస్తుల్ని, వనరుల్ని, వ్యవస్థను సమాజంలో అన్ని వర్గాలకు సమానంగా పంచాలన్నది నా లక్ష్యం. దారిదోపిడీగాళ్ళు సమాజం మీద పడి పీక్కుతినాలనుకుంటే దాన్ని సాగనివ్వను. నా జీవితం పారదర్శకం. ఎవరికో ఉపయోగపడాలన్న కోరిక ఏ మాత్రం లేదు. నేను ఈ బాధ్యతల్లో ఉన్నంతకాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైన క్రిమినల్స్ ని ప్రోత్సహించను. తెలంగాణ ఆర్థిక వ్యవస్థపైగానీ, వనరులపైనా గానీ వ్యవస్థలపైగానీ వారిని వాలనివ్వను. మీడియా సంస్థల మధ్య ఉన్న వైరాన్ని రాష్ట్రంమీద రుద్దడం సమంజసం కాదు. ఆ ఊబిలోకి మంత్రులు, అధికారులను లాగడం మంచిది కాదు. చూస్తూ ఊరుకోం” అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

సైట్ విజిట్ నిబంధన సింగరేణిదే :

టెండర్ దాఖలు చేయడానికి సైట్‌ను తప్పనిసరిగా విజిట్ చేయాలన్న నిబంధన సింగరేణి సంస్థ విధించిందే తప్ప తనకు ఎలాంటి సంబంధం లేదని డిప్యూటీ సీఎం భట్టి (Bhatti Vikramarka) స్పష్టత ఇచ్చారు. ఆ టెండర్లపై పూర్తి నిర్ణయాధికారం సింగరేణి సంస్థదేనని అన్నారు. ఈ మాత్రం జ్ఞానం కూడా లేకుండా కథనంలో రాధాకృష్ణ తన అభిప్రాయాలను పేర్కొన్నారని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. సైట్‌ను తప్పనిసరిగా విజిట్ చేయాలన్న నిబంధనకు కారణం ప్రతికూల భౌగోళిక పరిస్థితులను స్వయంగా విజిట్ చేసి టెండర్లలో ధరను కోట్ చేయడానికి వీలుంటుందనే ఉద్యదేశమేనని అన్నారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో నా పేరు బైటకు రావడం దురదృష్టకరమన్నారు. టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవాల్సిందిగా ఆదేశించానని తెలిపారు. 40 ఏండ్లుగా సభలో, సభ బైట పోరాటం చేస్తూ సమాజం కోసం నిలబడ్డానని, ఈ వివాదంలో తానూ రాధాకృష్ణ తేల్చుకుంటామన్నారు. కానీ ఇలాంటి కథనాలకు భయపడే ప్రసక్తే లేదన్నారు.

Read Also: నేడు ఖమ్మం, మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>