కలం, వెబ్ డెస్క్ : రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం అని కేంద్ర హోం సహాయశాఖ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్ లో శనివారం జరిగిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం ఆయన ప్రసంగించారు. అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిపిస్తే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని ఒప్పించి కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొస్తామని.. అవసరమైతే సీఎస్సార్ నిధులు తెచ్చి బీజేపీ పాలిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివ్రుద్ధి చేస్తామని చెప్పారు.
కేంద్రం నుండి వస్తున్న నిధులతోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నయాపైసా కూడా పట్టణ స్థానిక సంస్థల్లో ఖర్చు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. ‘జై శ్రీరాం’ అంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు. ఫిబ్రవరి 15లోపు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈనెల 28లోపు షెడ్యూల్ వెలువడే అవకాశముందని చర్చ జరుగుతోందన్నారు.
‘అర్బన్ లో బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ నుండి ఎవరు గెలిచినా మళ్లీ కాంగ్రెస్ లోకి వెళతారు. ఆ పార్టీ నుండి పోటీ చేయడానికి ఆసక్తి కూడా చూపడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉండబోతోంది’ అని Bandi Sanjay పేర్కొన్నారు.


