కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు మరో వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ పై కఠినంగా వ్యవహరించి ఎంతో మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను కట్టడి చేయించారు సీపీ సజ్జనార్. ఇప్పుడు లక్కీ డ్రా వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియాలో లక్కీ డ్రాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని సీపీ సీరియస్ అయ్యారు. లక్కీ డ్రాలను ప్రమోట్ చేస్తే కఠినంగా చర్యలుంటాయని ఇన్ ఫ్లూయెన్సర్లను హెచ్చరించారు సీపీ సజ్జనార్.
కొంత మంది టీమ్ గా ఏర్పడి కార్లు, బైకుల పేర్లతో లక్కీడ్రాలు వేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు సజ్జనార్ (Sajjanar). అలాంటి దందాలను లక్షల్లో ఫాలోవర్లు ఉన్న ఇన్ ఫ్లూయెన్సర్లు ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్నారని.. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దని సూచించారు. ఇలాంటివన్నీ చట్టవిరుద్ధమైనవే అన్నారు. వెంటనే ఆపేయకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. 1978 చట్టం కింద కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు సీపీ సజ్జనార్. ప్రజలు ఇలాంటివి అస్సలు నమ్మొద్దని.. లక్కీ డ్రాలు, లాటరీలు అంటూ మోసం చేస్తారని సీపీ చెప్పారు.


