కలం, మెదక్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తన ఎన్నికల ప్రచారం కోసం సంగారెడ్డికి పిలిచి ఇన్సల్ట్ చేశాను అనే ఫీలింగ్ ఉన్నదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సంగారెడ్డి పట్టణం గంజి మైదానంలో పేదలతో జరిగిన సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. రాహుల్ గాంధీ సంగారెడ్డికి వచ్చి… భుజం పై చేయి వేసి జగ్గారెడ్డిని గెలిపించాలని కోరితే సంగారెడ్డి ప్రజలు తనను ఓడించారన్నారు.
ఇది తనను గెలిపించాలని ప్రచారం చేసిన రాహుల్ గాంధీని.. ఓటమితో అవమానించినట్టు ఫీల్ అవుతున్నానని జగ్గారెడ్డి తెలిపారు. ఈ ఓటమిని జీవితంలో మరిచిపోలేననీ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సంగారెడ్డి ఎమ్మెల్యేగా జీవితంలో పోటీచేసే ప్రసక్తే లేదని, తన భార్య నిర్మలా పోటీ చేసినా కూడా ప్రచారం చేయనని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి ప్రచారం చేస్తా కానీ.. సంగారెడ్డిలో ప్రచారం చేయనని Jagga Reddy తేల్చిచెప్పారు.


