కలం, వెబ్ డెస్క్: విద్యార్థులు తమ భాషను మెరుగుపరుచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. కేవలం విద్య మాత్రమే ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందని చెప్పారు. పాలమూరు జిల్లాకు 75 ఏండ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి లభించిందని.. ఈ అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకొని జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. బూర్గుల రామకృష్ణా రావు తర్వాత తనకే ఈ పదవి లభించిందని చెప్పుకొచ్చారు. పాలమూరు జిల్లాకు విద్యా, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తున్నామని తెలిపారు.
విద్యే అన్ని సమస్యలకు పరిష్కార మార్గమని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. భాషను మెరుగుపరుచుకోవడంతో పాటు పట్టుదలతో కష్టపడి పనిచేస్తే జీవితంలో పైకి రావచ్చని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని మారుమూల పల్లె నుంచి వచ్చిన తాను 17 ఏళ్లలో ముఖ్యమంత్రి అయ్యానని, మంత్రి కాకపోయినా అందరి సహకారంతో సీఎం అయ్యానని తెలిపారు.
ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. గతంలో భూమిలేని నిరుపేదలు, ఆదివాసీలు, గిరిజనులు, దళితులకు భూములు పంచిన పరిస్థితులు ఉన్నాయని, ప్రస్తుతం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కూడా భూమి కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో విద్య ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.
విద్యలో రాణించాల్సిన అవసరం ఉందని, విద్యకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చెప్పారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. చదువుతోనే అవకాశాలు వస్తాయని, భవిష్యత్ కూడా చదువుపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు అన్ని విద్యా సంస్థలు తీసుకొస్తామని హామీ ఇచ్చిన సీఎం, నిబద్ధత లేని చదువు జీవితానికి ఉపయోగపడదని వ్యాఖ్యానించారు. చదువే సమాజంలో గౌరవాన్ని తీసుకువస్తుందని చెప్పారు. సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
ఏడాదిలో ఐఐఐటీ భవనం పూర్తిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


