కలం డెస్క్: బాక్సాఫీస్ దగ్గర రికార్డులు షేక్ చేస్తున్న బాలీవుడ్ మూవీ ‘ధురంధర్’ ఇప్పుడు మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ట్రెండ్ అవుతున్నది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ను ‘ధురంధర్’తో పోలుస్తూ ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. అత్యధిక మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను బీజేపీ, శివసేన నేతృత్వంలోని మహాయుతి కూటమి కైవసం చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతలు వేడుకలు జరుపుకుంటున్నారు. 2,800కుపైగా వార్డుల్లో కూటమి దాదాపు 1,800 సీట్లను సాధించింది. ఇందులో కేవలం కమలం పార్టీనే 1,400 వరకు సీట్లను సొంతం చేసుకోవడంతో ‘ధురంధర్’ కలెక్షన్లను పోలుస్తూ బీజేపీ కేడర్ సంబురాల్లో మునిగితేలుతున్నది. ఆధిత్య ధర్ (Aditya Dhar) డైరెక్షన్ లో రణవీర్ సింగ్ (Ranveer Singh) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురంధర్’ (Dhurandhar) సినిమా గత డిసెంబర్ 5న రిలీజ్ అయింది. ఇప్పటికి ఆ మూవీ రూ. 1,400 కోట్ల వరకు వసూళ్లను రాబట్టి.. సరికొత్త రికార్డును నెలకొల్పింది.
నేను సముద్రాన్ని!
2019లో ప్రతిపక్ష నేతగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్.. ‘‘నేను వెనక్కి తగ్గానేమో! అట్లనీ మీరు నా తీరం వెంట ఇండ్లు కట్టుకోవడానికి సాహసించొద్దు. నేను సముద్రాన్ని.. మళ్లీ తిరిగి వస్తాను!!” అంటూ చెప్పిన కవితను కూడా అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. ఎంతో కీలకమైన బీఎంసీ (BMC)ని కూడా మహాయుతి చేజిక్కించుకోవడంతో బీజేపీలో ఫుల్ జోష్ కనిపిస్తున్నది.


