కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ కార్పొరేషన్‌పై (Karimnagar Corporation) ఎంఐఎం గురి పెట్టినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ డివిజన్లలో గెలుపొంది కార్పొరేషన్లో మేయర్ ఎంపికలో కీలకం కావాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (Karimnagar Corporation) పరిధిలో 66 డివిజన్లు ఉండగా ఇటీవల అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితాలో 3,40,580 మంది ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ పట్టణంలో పలు డివిజన్లలో ముస్లిం ఓటర్లు మెజార్టీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 10 డివిజన్లలో పోటీ చేయగా ఏడుస్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న 20 డివిజన్లలో ఎంఐఎం పోటీ చేయాలని నిర్ణయించింది. మరో 20 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం 40 డివిజన్లలో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేయడానికి 140 మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెల 20వరకు ఎంఐఎం టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
కాంగ్రెస్‌తో స్నేహ పూర్వక పోటీ..?
కరీంనగర్ కార్పొరేషన్లో ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య స్నేహ పూర్వక పోటీ ఉంటుందని తెలుస్తుంది, ఎంఐఎం గెలిచే అవకాశాలు ఉన్న చోట కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్న చోట ఎంఐఎంకు అవకాశం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్‌పై దృష్టి సారించి కరీంనగర్ కార్పొరేషన్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎంఐఎం సైతం కార్పొరేషన్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇందుకు తగ్గటుగానే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తుంది.


