కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ (RS Praveen Kumar) కుమార్ పార్టీ మారబోతున్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తన పార్టీ మార్పుపై వస్తున్న వార్తలు క్లారిటీ ఇచ్చారు. తనకు బీఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబంధంపై ఎలాంటి సందేహాలకు తావు లేదని ఆయన తెలిపారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ తరహా అసత్య వార్తల వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందని, రాజకీయంగా తనను బలహీనపర్చాలనే ప్రయత్నం జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, పార్టీ బలోపేతం కోసం తాను కొనసాగుతూ పని చేస్తున్నానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని నిరాధార ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
అదే సమయంలో, తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికల్లోనూ, ఇతర మాధ్యమాల్లోనూ అసత్య సమాచారం వ్యాప్తి చేస్తే కఠినంగా ఎదుర్కొంటానని చెప్పారు. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మకుండా, నిజానిజాలను గమనించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.


