కలం, నార్కట్పల్లి: ఏఎంఆర్పీ పరిధిలోని రైతులు చేసిన పాపం ఏమిటని, సాగర్ ఎడమ కాలువ, వరద కాలువల ద్వారా పలుమార్లు నీటిని విడుదల చేసి చెరువులు నింపుతున్న ప్రభుత్వం.. ఏఎంఆర్పీ పరిధిలోని చెరువులను ఎందుకు నింపడం లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ఎడమ కాలువలో నీటిని విడుదల చేస్తున్నప్పటికీ సరైన ప్రణాళిక లేక నీరు వృథాగా పోతోందని ఆరోపించారు. వరద కాలువ ద్వారా ఇప్పటికే రెండు, మూడు సార్లు నీటిని విడుదల చేసి చెరువులను నింపారని, ఏఎంఆర్పీ పరిధిలో మాత్రం ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా చెరువులు, కుంటలను నింపకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
ఏఎంఆర్పీ పరిధిలోని రైతులు దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలుగా నిమ్మ, బత్తాయి తదితర పండ్ల తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సాగర్లో నీరు అందుబాటులో ఉన్నప్పుడే చెరువులు, కుంటలను నింపకపోతే రానున్న వేసవిలో నీటిని అందించడం సాధ్యం కాదన్నారు. దీంతో గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఏర్పడటమే కాకుండా, పండ్ల తోటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో వేసవి తాగునీటి అవసరాలు, పంటల రక్షణను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో ఏఎంఆర్పీ పరిధిలోని చెరువులు, కుంటలను నింపి రైతులకు ఇబ్బందులు లేకుండా చూశారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి రైతుల పట్ల కనీస ప్రేమ, చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
ఒకవైపు చెరువులకు నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు చందనపల్లి, దండంపల్లి తదితర ప్రాంతాలతో పాటు ఏఎంఆర్పీ కాలువ పొడవునా రైతుల మోటార్లను తొలగించే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టుల కోసం విలువైన భూములను త్యాగం చేసిన రైతులకు నీటిని వినియోగించుకునే అవకాశం కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. జిల్లా మంత్రులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతు వ్యతిరేక చర్యలను మానుకోవాలని, ఏఎంఆర్పీ పరిధిలోని నకిరేకల్, నల్గొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఉన్న అన్ని చెరువులు, కుంటలను నింపేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు.

