కలం, ఖమ్మం బ్యూరో: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadashi) ఉత్సవాల (2026–27) షెడ్యూల్ను ఆలయ అధికారులు, అర్చకులు ఖరారు చేశారు. డిసెంబర్ 10 నుంచి 2027 జనవరి 16 వరకు పలు వేడుకలు జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పించేందుకు ఆలయ ఈవో నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు!
డిసెంబర్ 10న మత్స్యావతారంతో పగల్వత్తు వేడుకలు మొదలై డిసెంబర్ 30 వరకు అధ్యయనోత్సవాలు కొనసాగుతాయి. ఆ తర్వాత డిసెంబర్ 31 నుంచి జనవరి 2, 2027 వరకు విలాసోత్సవాలు జరుగుతాయి. జనవరి 4న సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు విశ్వరూప సేవ ఉంటుంది. జనవరి 11న కూడారై పాశురోత్సవం, జనవరి 14న భోగి రోజు ఉదయం గోదా కళ్యాణం, జనవరి 15న సంక్రాంతి రాత్రి రథోత్సవం, జనవరి 16న కనుమ రోజు ఉదయం ఆండాళ్ అమ్మవారి తిరువీధి సేవ నిర్వహిస్తారు.
డిసెంబర్ 19న తెప్పోత్సవం
డిసెంబర్ 19న శనివారం తెప్పోత్సవం సందర్భంగా ఉదయం 4 గంటలకు ఆలయం తెరిచి సుప్రభాత సేవ, సర్వ దర్శనం చేస్తారు. ఉదయం 4:30 నుంచి 6 గంటల వరకు పూజలు, గోష్ఠి కారణంగా భక్తులకు దర్శనం ఉండదు. ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు మొదలవుతాయి. ఉదయం 7:30 నుంచి 8:30 వరకు పంచామృతాభిషేకం, ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పగల్వత్తు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటలకు దర్బారు సేవ తర్వాత సాయంత్రం 4:02 నుంచి 5 గంటల మధ్య స్వామి వారు ఊరేగింపుగా గోదావరి నదికి వెళ్తారు. సాయంత్రం 5:02 నుంచి 6:02 వరకు తెప్పపై దర్శనం ఇస్తారు. సాయంత్రం 6:02 నుంచి రాత్రి 7:32 వరకు గోదావరిలో ఐదుసార్లు తెప్పోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7:55 నుంచి 9:35 వరకు వాహన సేవ, తిరిగి ఆలయానికి ఊరేగింపు, పూజల తర్వాత తలుపులు మూసివేస్తారు.
వైకుంఠ ఏకాదశి వేళలు!
డిసెంబర్ 20న ఆదివారం వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadashi) రోజున తెల్లవారుజామున 12 గంటల నుంచి సుప్రభాతం, ఆరాధన, అభిషేకం, అలంకరణ, బాలభోగం వంటి పూజలు జరుగుతాయి. తెల్లవారుజామున 3:45 గంటలకు ఉత్సవమూర్తులు వైకుంఠ ద్వార మండపానికి చేరుకుంటారు. అప్పటి నుంచే భక్తులకు మూలమూర్తుల దర్శనాలు మొదలవుతాయి. తెల్లవారుజామున 5:01 నుంచి ఉదయం 6:03 గంటల వరకు ఉత్తర ద్వారం (వైకుంఠ ద్వారం) తెరిచి ఉంచుతారు. ఉదయం 6:03 గంటలకు స్వామి వారు సీతా లక్ష్మణ సమేతంగా తిరువీధి సేవకు బయలుదేరుతారు.
డిసెంబర్ 10 నుంచి 19 వరకు స్వామి వారి రాకపోకల కోసం దక్షిణ వైపున ర్యాంప్ నిర్మిస్తున్నారు. భక్తులు దక్షిణ వైపు ర్యాంప్ నుంచి లోపలికి వెళ్లి, తూర్పు మెట్ల ద్వారా బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 20 నుంచి జనవరి 2 వరకు రాపత్తులు, విలాసోత్సవాలను మిథిలా స్టేడియంలోని శ్రీరామ సేవా మండపంలో నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఉత్సవ వేళలు, ఏర్పాట్లలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

