కలం, నిర్మల్ : జిల్లాకు చెందిన ఏడుగురు క్రీడాకారులు జాతీయ స్థాయి సబ్-జూనియర్ వుషు ఛాంపియన్‌షిప్ (Sub-Junior Wushu Championship) పోటీలకు ఎంపికయ్యారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ‘కిట్’ యూనివర్సిటీ క్యాంపస్ లోని బిజు పట్నాయక్ ఇండోర్ స్టేడియంలో 26వ సబ్-జూనియర్ నేషనల్ వుషు ఛాంపియన్‌షిప్ పోటీల్లో వీరు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. తెలంగాణ ఔత్సాహిక వుషు సంఘం ఆధ్వర్యంలో, ఆదిలాబాద్ జిల్లా ఔత్సాహిక వుషు సంఘం నిర్వహణలో నవంబరు 20, 21, 22 తేదీలలో ఆదిలాబాద్‌లో జరిగిన నాలుగో సబ్-జూనియర్ వుషు ఛాంపియన్‌షిప్ పోటీలలో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు.
ఈ పోటీలలో ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను శనివారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ లు అభినందించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి పతకాలు, ప్రశంసా పత్రాలు అందించారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. విద్యార్థులను అభినందించిన వారిలో డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.

