కలం, నిర్మల్: కుల వ్యవస్థ కారణంగా వేల సంవత్సరాలుగా అణచివేతకు గురైన శ్రామిక, బహుజన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే( Jyotirao Phule) వెలుగుదివ్వెగా నిలిచారని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న ముదిరాజ్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ.. మహాత్మా పూలే తన జీవితకాలమంతా భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని కొనియాడారు.
సమాజంలో మార్పు రావాలంటే విద్య ఒక్కటే ఆయుధమని గుర్తించి, విద్యకు దూరమైన వర్గాలకు చదువును చేరువ చేశారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ సైతం మహాత్మా పూలేను తన గురువుగా భావించారంటే ఆయన గొప్పతనం, సమాజానికి చేసిన సేవలు ఎంతటి మహోన్నతమైనవో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు అడ్వకేట్ గంగాధర్, లీగల్ సెల్ అడ్వైజర్ అడ్వకేట్ శ్రీకాంత్, జిల్లా అధికార ప్రతినిధి వినేష్, దిలావర్పూర్ మండల అధ్యక్షుడు స్వామి, సోషల్ మీడియా ఇన్చార్జి అశోక్, నాయకులు సాయి, గణేష్, పోతన్న, భీమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

