కలం, మధిర: ముంబై (ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్) నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (Konark Express) (రైలు నంబర్ 11019) లో ఓ యువతి అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. రైలు ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ (Madhira Railway Station) కు చేరుకోగానే ఆమె ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. యువతి అస్వస్థతకు గురికావడాన్ని గమనించిన తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురై, వెంటనే రైల్వే సిబ్బందికి, 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు.
హుటాహుటిన స్టేషన్‌కు చేరుకున్న 108 వైద్య సిబ్బంది యువతికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. యువతి మృతి చెందినట్లు తొలుత ప్రచారం జరిగినప్పటికీ, ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, రైల్వే అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఘటన కారణంగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ మధిర రైల్వే స్టేషన్‌లో సుమారు అరగంట పాటు నిలిచిపోయింది. యువతిని ఆసుపత్రికి తరలించిన అనంతరం రైలు తిరిగి తన గమ్యస్థానానికి బయలుదేరింది. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

