కలం, ఖమ్మం బ్యూరో: ట్రాఫిక్ నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరిస్తూనే, ప్రజలు, వాహనదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని భద్రాద్రి జోన్ ఇన్చార్జి డీఐజీ, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత (DIG Swetha) స్పష్టం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన ట్రాఫిక్ సేవలు అందిస్తూ, వాహనదారుల్లో ట్రాఫిక్ (Khammam Traffic Police) నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఖమ్మంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌తో పాటు పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని (సీపీవో) ఆమె తనిఖీ చేశారు.
ముందుగా ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న డీఐజీ ఎన్. శ్వేతకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ ఆవరణలో పోలీస్ కమిషనర్‌తో కలిసి డీఐజీ మొక్కలు నాటారు. తర్వాత పోలీస్ సిబ్బంది కిట్ నిర్వహణ, స్టేషన్ నిర్వహణ, పనితీరు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థ సజావుగా సాగడంలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. నిత్యం సామాన్య ప్రజల మధ్య ఉంటూ విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది సహనం, సంయమనం, ఓర్పుతో వ్యవహరించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజా రవాణాకు అంతరాయం కలగడంతో పాటు వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు.
కాలుష్యం, దుమ్ము, వాహనాల పొగ మధ్య విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని డీఐజీ సూచించారు. అవసరమైన రక్షణ పరికరాలు వినియోగించుకోవడంతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. అనంతరం సీపీవోలోని పరిపాలన విభాగం, షీటీమ్, సీసీఆర్బీ, నార్కోటిక్, భరోసా సెంటర్లను సందర్శించి ఆయా విభాగాల రికార్డులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు శివప్రసాద్, అప్పలనాయుడు, రేంజ్ ఆఫీస్ సూపరింటెండెంట్ యాకుబ్ బాబా తదితరులు పాల్గొన్నారు.

